లంచాలకు తావు లేదు.. జగన్ వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

లంచాలకు తావు లేదు.. జగన్ వార్నింగ్

March 31, 2022

bfbf

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకంపై గురువారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను జగన్‌కు అధికారులు అందించారు. అలాగే, సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను జగన్‌ పరిశీలించారు.

జగన్ అధికారులతో మాట్లాడుతూ.. ”ఆంధ్రప్రదేశ్‌లో లంచాలకు, అవినీతికి తావు లేదు. సమగ్ర భూ సర్వే నిజాయితీతో జరగాలి. ఈ విషయంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలవాలి. వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించండి. అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఈ కార్యక్రమం జరగాలి” అని జగన్ అన్నారు.

అంతేకాకుండా ‘ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోండి. భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయండి. దీని ద్వారా స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. భూ యజమానులకు క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేవరకు ఎలాంటి వివాదాలు లేకుండా చూడండి. న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయండి. సమగ్రంగా ఓ రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేయండి’ అని జగన్ అధికారులకు సూచించారు.

దీంతో స్పందించిన అధికారులు ఏప్రిల్‌ 5వ తేదీ కల్లా భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని జగన్‌కు వివరించారు.