భారతీయ కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటోకి బదులుగా.. మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా ముద్రించనున్నట్లు వచ్చిన వార్తలను ఆర్బీఐ ఖండించింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ, నోట్లలో ఎలాంటి మార్పులు చేయబోయేది లేదని ఆర్‌బీఐ సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్న మహాత్ముడి చిత్రాన్ని మార్చే ప్రతిపాదనేదీ లేదని ఆ నోట్ ద్వారా ఆర్బీఐ తేల్చి చెప్పింది.
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రానికి బదులుగా రబీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల ఫొటోలతో కొత్త బ్యాంకు నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రణాళికలు, డిజైన్లు కూడా పూర్తయినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన కేంద్ర బ్యాంకు వదంతులను కొట్టిపారేసింది. అసలు అలాంటి ప్రతిపాదనేదీ లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.