Home > Featured > ఒక్క కప్పు నీళ్ళతో 80 సెకన్లలో బట్టలుతికే వాషింగ్ మెషిన్

ఒక్క కప్పు నీళ్ళతో 80 సెకన్లలో బట్టలుతికే వాషింగ్ మెషిన్

వాషింగ్‌ మెషిన్‌ బట్టలు ఉతకాలంటే తక్కువలో తక్కువ 100 లీటర్ల నీళ్లు కావాలి. కనీసం గంట, రెండు గంటల పాటు కిందేసి, మీదేసి.. తిప్పితే గానీ మురికి వదలదు. కానీ, 80 సెకన్లలోనే, కేవలం సగం కప్పు నీళ్లతో.. అదీ డిటర్జెంట్‌ అవసరమే లేకుండా బట్టలను శుభ్రం చేస్తే! అద్భుతమే కదా. దాన్ని సుసాధ్యం చేసి చూపించిందో భారత స్టార్టప్‌. నీటి వృథాను అరికట్టి, రసాయనాల వాడకాన్ని తగ్గించే వాషింగ్‌ మెషిన్‌ను స్టార్టప్‌కు చెందిన రుబుల్‌ గుప్తా, నితిన్‌ కుమార్‌ సలూజా, వరిందర్‌ సింగ్‌ రూపొందించారు.

ఈ వాషింగ్‌ మెషిన్‌ ఐఎస్పీ స్టీమ్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. అంటే.. పొడి ఆవిరి, రేడియో ఫ్రీక్వెన్సీతో కూడిన మైక్రోవేవ్‌ పరిజ్ఞానంతో బట్టలు శుభ్రం అవుతాయన్న మాట. బట్టలను ఈ వాషింగ్‌ మెషిన్‌లో వేయగానే అయానీకరణ చేయని మైక్రో కిరణాలు బట్టలపై పేరుకొన్న బ్యాక్టీరియాను పూర్తిగా చంపేస్తాయి. తర్వాత సగం కప్పు నీళ్లు పొడి ఆవిరిగా మారి బట్టలపై ఉన్న మురికిని, దుర్వాసనను తొలగిస్తాయి. ఇలా ఒక దశ పూర్తి కావటానికి 80 సెకన్ల సమయాన్నే తీసుకొంటుంది. మొండి మరకలైతే మరోసారి ఉతకాల్సి ఉంటుంది. సుమారు నాలుగైదు సార్లు ఉతికితే మొండి మరకలు పోతాయి. అదే 70-80 కిలోల సామర్థ్యం గల పెద్ద మిషిన్‌తోనైతే ఒకేసారి 50 దుస్తులను ఉతుక్కోవచ్చు. దీనికి 5-6 గ్లాసుల నీరు అవసరమవుతుంది.

పంజాబ్‌లోని చిత్కార యూనివర్సిటీ రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ డైరెక్టర్‌ నితిన్‌ కుమార్‌, ఆస్టోసింక్‌ ఇన్నోవేషన్‌ కంపెనీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వరిందర్‌, బీటెక్‌ విద్యార్థి రుబుల్‌ కలిసి దవాఖానల కోసం యూవీ కిరణాలతో పనిచేసే ఇన్‌స్టంట్‌ స్టెరిలైజేషన్‌ మెషిన్‌ను తయారు చేశారు. పర్యావరణానికి మేలు కలిగించేలా ఆ మెషిన్‌ను మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించిన వారికి 80వాష్‌ ఆలోచన తట్టింది. యూవీ కిరణాలతో బట్టల మురికిని వదలగొట్టడం వీలు కాదని తెలిసి, పొడి ఆవిరిని కూడా ఉపయోగించారు. అనుకొన్నట్టే వారి కృషి ఫలించింది.

Updated : 27 July 2022 2:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top