కొడుకు,కోడలు ఒకవైపు..అత్తమామ,ఆడపడుచు ఇంకోవైపు. ఇదేదో సీరియల్ గొడవ కాదు..సీరియస్‌గా రియల్ వార్. సై అంటే సై అంటూ సమరానికి దిగారు. బరిలోకి దిగి గల్లీ గల్లీ తిరిగారు. కోడలుకు కాదు…మాకే ఓటేయాలని మామ ప్రచారం చేశారు.మామ చెబుతున్నట్టు కాదు తమకే ఓటేయాలని కోడలు జనాన్ని అభ్యర్థించారు. తీరా పోలింగ్ ముగిసింది. విజయంపై కోడలు ధీమా వ్యక్తం చేస్తుంది.పనిలోపనిగా ఇంటి గుట్టును బయటపెట్టింది.ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..అదే క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య..రివాబా జడేజా గురించి…
కోడలు వర్సెస్ మామ
గుజరాత్ ఎన్నికల్లో జామ్ నగర్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈమెకు ప్రత్యర్థులేవరో కాదు స్వయంగా మామ,ఆడపడచులే.వీళ్లు కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. అంటే రివాబా జడేజాకు వ్యతిరేకంగా..అందరూ ఒకే ఫ్యామిలీ.కానీ పార్టీలు వేరు వేరు. ఇలా ఎవరికి వారే జామ్ నగర్లో ప్రచారం చేశారు. ఈ సమయంలో జడేజా నాన్న , సోదరి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని వీడియోలు వైరల్ అయ్యాయి.మొత్తానికి ఎవరి స్థాయిలో వాళ్లు ప్రచారం చేసుకున్నారు. గురువారం పోలింగ్ ముగింది. ఆ తర్వాత అందరూ మీడియాతో అసలు మాట్లాడారు.
రివాబా ధీమా
” ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. ఒకే కుటుంబమైనా విభన్న సిద్ధాంతాలు పాటించేవారు ఉండొచ్చు. వాళ్లు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినా నాకు నష్టం ఏమి లేదు. జామ్ నగర్లో గెలుపు బీజేపీదే. నేను తప్పకుండా గెలుస్తా. నాకు వ్యతిరేకంగా జడేజా నాన్న, సోదరి కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేశారు. అయినా జామ్ నగర్లో బీజేపీయే విజయం సాధిస్తుంది”అని రివాబా జడేజా అన్నారు.
మామమాట
“కుటుంబం వేరు,పార్టీ వేరు..రెండంటిని కలిపి చూడొద్దు. ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వారికుంటాయి. మేం మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాం. అందుకే జామ్ నగర్లో కాంగ్రెస్‌కు ప్రచారం చేశా. భవిష్యత్‌లో కాంగ్రెస్‌లోనే ఉంటా”అని జడేజా తండ్రి అనిరుద్ధ్ చెప్పారు.
ఆడపడచు మాట
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీచేసినంతమాత్రన సోదరుడిపై గానీ, ఆయన భార్యమీదగానీ ప్రేమలు తగ్గవని రవీంద్ర జడేజా సోదరి నైనబా జడేజా అన్నారు. తమ కుటుంబంలో ప్రతీ ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. ఎవరికి నచ్చిన పనివారు చేసుకోవచ్చని ఆమె చెబుతోంది.
ఇక రివాబా..హరిసింగ్ సోలంకి కూతురు. హరిసింగ్ సోలంకి కాంగ్రెస్ సీనియర్ నేత. 2016లో రవీంద్ర జడేజాను రివాబా పెళ్లి చేసుకున్నారు. 2019లో బీజేపీలో చేరారు. అప్పటినుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడు జామ్ నగర్ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.