No hike in ticket prices under any circumstances: Sajjanar
mictv telugu

ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచం: సజ్జనార్

August 31, 2022

”తెలంగాణ ఆర్టీసీ సంస్థ దాదాపు రూ. 2,500 కోట్ల నష్టాల్లో ఉంది. ఏడాది కాలంలో వీటన్నింటి నుంచి బయటపడి, సంస్థను ఓ కోటి రూపాయల లాభంలో ఉంచాలనేది మా లక్ష్యం. చాలా పెద్ద లక్ష్యం పెట్టుకున్నాం. కానీ దాన్ని సాధించేందుకు అంతే కష్టపడుతున్నాం. ఓవైపు సంస్థను కాపాడుకుంటూనే, మరోవైపు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే డీజిల్‌సెస్ పెంచాం. ఇకపై టికెట్ ధరలు పెంచం. వేరే మార్గాల్లో సంస్థను లాభాల్లోకి తీసుకొస్తాం” అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.

తాజాగా ఆర్టీసీ అధికారులు..రూ. 2,500 కోట్ల అప్పును తీర్చటం కోసం పలు ప్రణాళికలు రచించారు. అందులో బస్సుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై దృష్టి సారించారు. మొదటగా ఆర్టీసీ కార్గో సేవలను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్టీసీ దవాఖాన, నర్సింగ్ కాలేజీ, ఐటీఐ కాలేజీల ద్వారా ఫలితాలను రాబట్టుతున్నారు.

ఈ క్రమంలో త్వరలోనే ఆర్టీసీ సంస్థ జీవ (ziva) అనే బ్రాండ్‌తో వాటర్ బాటిళ్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయ్యింది. ఇవే కాకుండా పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సైతం సిద్ధమవుతుంది. అలాగే, రాష్ట్రంలో సంస్థకు ఉన్న ఖాళీ స్థలాలను సైతం ఆదాయ వనరులుగా మార్చుకోనుంది. ఈ మేరకు దాదాపు 30కిపైగా స్థలాలలో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే వివిధ సంస్థలతో ఒప్పందాలు సైతం చేసుకుందని సజ్జనార్ తెలిపారు.