యూపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్ విధానంపై గురువారం సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో కూల్చివేతలు చట్ట ప్రకారమే చేపట్టాలని, అంతేగానీ, ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదని స్పష్టం చేసింది. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో భాగంగా నిందితుల ఇళ్లు కూల్చివేయడంపై పిటిషన్ దాఖలైంది. దానిపై వాదనలు విన్న సుప్రీం.. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ఇళ్ల కూల్చివేతలు నిలిపివేయాలని మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు.
ఉత్తర ప్రదేశ్‌లో చట్టవిరుద్ధంగా ఇళ్ళను కూల్చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరుతూ ఈ పిటిషన్‌ను జామియా ఉలేమా ఈ హింద్ దాఖలు చేసింది. అక్రమ కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. చట్టపరమైన సముచిత ప్రక్రియను అనుసరించకుండా ఇకపై ఎటువంటి కూల్చివేతలు ఉండబోవని రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ పొందాలని కోరింది. బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో చాలా చోట్ల ముస్లింలు హింసాత్మక నిరసన ప్రదర్శనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రయాగ్‌రాజ్, కాన్పూరు పురపాలక సంఘాలు నిందితుల అక్రమ నిర్మాణాలను కూల్చేశాయి.