ఆమె నీ తల్లిరా.. మునిసిపాలిటీ వాళ్లకైనా చెప్పొచ్చు కదరా! - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె నీ తల్లిరా.. మునిసిపాలిటీ వాళ్లకైనా చెప్పొచ్చు కదరా!

August 13, 2019

కన్నతల్లి చనిపోతే ఆమె మృతదేహాన్ని చెత్తకుండీలో పారేశాడో కఠినాత్ముడు. అతనికి అప్పుడు గుర్తుకు రాలేదా.. తన కడుపు నింపడానికి ఆ తల్లి ఎన్నిసార్లు కడుపు మాడ్చుకుందో? తనను నిద్రపుచ్చటానికి ఆ తల్లి ఎన్ని రాత్రులు తన నిద్ర చంపుకుందో? ఇలాంటివి ఆ తల్లి ఎన్నో త్యాగాలు చెయ్యకుండా తాను పెద్దవాడయ్యానా? ఇలా ఒక్కటంటే ఒక్క ప్రశ్న అయినా అతను వేసుకోలేకపోయాడా?? ఆమె ప్రేమను పంచి అతన్ని పెద్దవాణ్ని చేస్తే అది అతనిలో విషంగా మారినట్టుంది. ఆమె రొమ్ము పాలు తాగిన అతని గుండె రాయిలా మారి చివరికి ఆ తల్లి శవాన్ని చెత్తకుప్ప పాలు చేసినట్టున్నాడు. ఏ కన్నవాళ్లైనా తమ కడుపున పుట్టినవాళ్లు తమకు తలకొరివి పెట్టాలని కోరుకుంటారు. కానీ, ఈ తల్లి విషయంలో అది పచ్చి నిజం కాలేదు. కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

సోమవారం ఉదయం ఓ వృద్ధురాలి మృతదేహం చెత్తకుండీలో ఉండటం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టి ఆ వృద్ధురాలి మృతదేహం తూత్తుకుడి జిల్లా ధనసింగ్‌ నగర్‌కు చెందిన ముత్తులక్ష్మణన్‌ తల్లి వసంతిదిగా గుర్తించారు. అతను ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. కొడుకే తల్లి శవాన్ని చెత్తకుండీలో పారేసి వెళ్లినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. తల్లి మృతదేహాన్ని అంత నిర్దయగా ఎందుకు పారేశావు అని పోలీసులు ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానం విని పోలీసులు నివ్వెరపోయారు. 

వయోభారం కారణంగా తల్లి మృతి చెందిందని, అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఈ పని చేసినట్లు ముత్తులక్ష్మణన్‌ చెప్పాడు. డబ్బులు లేకపోతే ఎవరి ముందు చేయిచాచినా తలా ఇంత సాయం చేసేవాళ్లం కదా.. ఇంత దారుణంగా తల్లి మృతదేహాన్ని చెత్తకుండీలో పారేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందని స్థానికులు ఆ కఠిన కొడుకును నిలదీస్తున్నారు.