ఒక్కప్పుడు పాస్‌పోర్ట్ కోసం అప్లైయ్ చేసాక…వెరిఫికేషన్ మూడు నెలలు వేచిఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడంతా ఆన్‌లైన్ కావడంతో ఆ సమయం కాస్త తగ్గింది. ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోసం 15రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఆ 15రోజులు కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదని చెబుతోంది కేంద్ర హోం శాఖ. ఇప్పుడు కేవలం 5రోజుల్లోనే ఆన్ లైన్ ద్వారా పాస్ పోర్టు వెరిఫై అవుతుందని వెల్లడించింది. ఢిల్లీ పోలీసుల 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కింగ్స్‌వే క్యాంప్‌లో ఏర్పాటు చేసిన పరేడ్‌కు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పూర్తి ఆన్‌లైన్ సౌకర్యాన్ని ప్రారంభించారు.
ఢిల్లీలోనే ప్రతిరోజూ దాదాపు 2000 దరఖాస్తులు వస్తున్నాయని, వెరిఫికేషన్ కోసం ప్రజలు 15 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ సౌకర్యం ఉండడంతో అందులో ఎలాంటి జాప్యం ఉండదని, 5రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి కానుందని తెలిపారు. ప్రజలకు సమయం చాలా విలువైనదని అన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ట్యాబ్లెట్ ద్వారా పాస్‌పోర్ట్ దరఖాస్తు వెరిఫికేషన్ సదుపాయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు.
మొబైల్ టాబ్లెట్ నుండి పాస్‌పోర్ట్ కోసం పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను అనుసరించడం ద్వారా, ఐదు రోజుల్లో ధృవీకరణ చేయబడుతుంది. ఇప్పుడు దీని కోసం ప్రజలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ వెరిఫికేషన్ సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రజలకు సౌకర్యాలు పెరగడంతో పాటు ఇబ్బందులు తగ్గుతాయి.
– గతంలో పోలీసు వెరిఫికేషన్‌కు 14 రోజుల గడువు ఉండేది. ఇందులో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు స్వీకరించిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు సిబ్బంది దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లేవారు.
– దీని తర్వాత అతను నివేదికను సిద్ధం చేసి, దానిని ఆఫ్‌లైన్ మోడ్‌లో పంపేవాళ్లు.
– మొత్తం ప్రక్రియ రెండు వారాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు కొత్త ప్రక్రియలో సాంకేతికతను ఉపయోగించనున్నారు.
– ఈ ప్రక్రియ మొత్తం కాగిత రహితంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన యాప్ ట్యాబ్‌లో ఉంటుంది.
– ఆన్‌లైన్ దరఖాస్తు అందిన తర్వాత, పోలీసు వెరిఫికేషన్ అధికారి దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి, యాప్ ద్వారా మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తారు.
– టాబ్లెట్‌లో GPS ఉంటుంది. ఇది ధృవీకరణ అధికారి దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లారా లేదా అనే విషయాన్ని కూడా చూపిస్తుంది.
– ఈ యాప్‌తో ఒక రోజులో చాలా మంది దరఖాస్తుదారుల వెరిఫికేషన్ చేయవచ్చు.