తినే ఆహారం విషయంలో విద్యార్థులకు ఓ కాలేజీ యాజమాన్యం షాకిచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హంసరాజ్ కాలేజీ హాస్టల్, క్యాంటీన్లో మాంసాహారాన్ని నిషేధించినట్లు పిన్సిపాల్ ప్రొఫెసర్ రమ తెలిపారు. అంతేకాదు.. తాము మాంసాహారం అందిస్తామనే హామీతో విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వలేదని యాజమాన్యం చెప్పింది. దీంతో విద్యార్ధుల కాస్త అసహనానికి గురయ్యారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు మూడేళ్ల పాటు కాలేజీ హాస్టల్, క్యాంటీన్లు తెరచుకోలేదు. నిజానికి కోవిడ్ వ్యాప్తికి కొద్ది రోజుల ముందే కాలేజీలో నాన్‌వెజ్‌కు గుడ్ బై చెప్పారు. ఆఫ్‌లైన్‌లో క్లాసులు ప్రారంభమైన తర్వాత కూడా దాన్నే కొనసాగించారు.
తాజాగా ప్రిన్సిపాల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘ గత మూడునాలుగేళ్ల కిందటే కాలేజీ హాస్టల్, క్యాంటీన్లో మాంసాహార భోజనాన్ని నిలిపివేశాం. అయితే, నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులతో ఒక మాట చెప్పి ఉండాల్సింది. ఆ తర్వాత ఆచరణలోకి తీసుకురావాల్సింది. అందుకే మీడియా సమక్షంలో నిర్ణయాన్ని చెబుతున్నాం.’’ అని ఆమె అన్నారు. కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థులు కూడా కట్టుబడి ఉండాలని చెప్పారు.