దేశంలో ఓ కొసకు ఉండే నాగాలాండ్ మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా అస్సలు ప్రతిపక్షమే లేకుండా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఎన్ డీపీపీ-బీజెపీ కూటమి అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఇప్పుడు ఆ పార్టీకే మిగతా అన్ని పార్టీలు మద్దతు తెలపాయి. దీంతో రాష్ట్రంలో మరోసారి ఎన్డీపీపీ-బీజెపీ ప్రతిపక్షం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
60 మంది సభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. ఈ నెల 2 ను ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇందులో ఎన్డీపీపీ 25, బీజెపీ 12 స్థానాలు సంపాదించుకున్నాయి. ఈ రెండు పార్టీలు ఫలితాల కన్నా ముందే ఒక్కటవ్వడంతో 37మంది ఎమ్మెల్యేలు కలిసి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మిగతా పార్టీలు అయిన ఎల్జేపీ,ఆర్పీఐ,స్వతంత్ర ఎమ్మెల్యేలు ముందునుంచే అధికార కూటమికే మద్దతు తెలిపాయి. ఇప్పుడు ఎన్సీపీ, ఎన్పీఎఫ్ లు కూడా ఎన్డీపీపీ కి మద్దతు తెలుపుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అధికార కూటమిలో చేరినట్టు అయి అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా అయిపోయింది. గతంలో కూడా ఇలానే 2015లో, 2021లో రాష్ట్రంలో అన్ని పార్టీలు అధికార పార్టీకే మద్దతు పలికాయి.
ఈ సారి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీని సాధించిన ఎన్డీపీపీ అధినేత నిఫియు రియో 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పడు ఇది కూడా ఒక రికార్డు. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రిగా ఈయన రికార్డు సృష్టించనున్నారు.