ఉత్తచేయిపై నోరెత్తని కమలనాథులు - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తచేయిపై నోరెత్తని కమలనాథులు

September 4, 2017

కేంద్రంలోని మోదీ కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు జరిగిన తీవ్ర అన్యాయంపై లోకల్ బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. ఏం మాట్లాడితే ఏ ముప్పొస్తుందేమోనని భయపడుతున్నారు. ఈ విషయంపై వారి స్పందన తెలుసుకోవడానికి మీడియా వారిని కదిలించినా ఫలితం లేకపోతోంది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మంత్రిగా ఉండిన బండారు దత్తాత్రేయను కేబినెట్ నుంచి తప్పించిన మోడీ ఆయన స్థానాన్ని తెలంగాణకే చెందిన బీజేపీ నేతతో భర్తీ చేస్తారని వార్తలు రావడం తెలిసిందే. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, జలవనరుల నిపుణుడు వెదిరె శ్రీరాంలలో ఎవరినో ఒకరిని తీసుకుంటారని భావించారు. ఇక ఏపీ నుంచి వెంకయ్య నాయుడిని మంత్రి పదవి నుంచి తప్పించి ఉపరాష్ర్టపతి చేసిన మోదీ.. ఆ రాష్ట్రం నుంచి కంభపాటి హరిబాబు, రాం మాధవ్ లలో ఒకరిని కేబినెట్ లోకి తీసుకుంటారని అనుకున్నారు. ఈ ఆశలకు, ఊహాగానాలకు మోదీ జెల్ల కొట్టి మొండి చేయి చూపారు. పార్టీలో మోదీ, అమిత్ షాల ఆదేశాలు శిలాక్షరాలు కావడంతో వారిని ఎవరూ  ప్రశ్నించే పరిస్థితి లేదు.  అందుకే ఇరు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు ఈ అంశంపై మాట్లాడడానికి మీడియా ముందుకు రావడం లేదు. ప్రశ్నిస్తే ఉన్న కాసిన్ని నామినేటెడ్, పార్టీ పోస్టులూ ఊడిపోతాయని భయపడుతున్నారు.

నిజానికి మోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అసలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎన్డీయే గూటిలోని టీడీపీతోపాటు తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కూడా తాను ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తుండడంతో మోడీ ఈ రాష్ట్రాలను లైట్ తీసుకున్నారు. పైగా ఈ రాష్ట్రాల్లో బీజేపీ బలం కూడా నామమాత్రం కావడం, భవిష్యత్తులో బలపడే చాన్సులు కూడా లేకపోవడం దీనికి కారణం. తెలంగాణలో టీఆర్ ఎస్ హవాతోపాటు, మజ్లిస్, కమ్యూనిస్టు ఉద్యమాలు ఉన్నాయి. ఏపీలో టీడీపీ, వైకాపాలు బలంగా ఉన్నాయి. వాటిని దాటుకుని కాషాయదళం శక్తిమంతమయ్యే అవకాశం లేదు. బండారు దత్తాత్రేయ అనుచర వర్గం నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడం మోదీ స్వేచ్ఛగా కేబినెట్ ను విస్తరించడానికి మార్గాన్ని సుగమం చేసింది. అలాగే వెంకయ్యనాయుడు ఏపీ నుంచి ఎప్పుడూ పార్లమెంటుకు ఎన్నిక కాకపోవడం వల్ల, ఆయన స్థానాన్ని అక్కడి నేతతో భర్తీ చేయాలన్న డిమాండే రాలేదు.

వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కాషాయ అధిష్టానం తెలుగు రాష్ట్రాలకు ఉత్త చేయి చూపింది. ఎన్నికల్లో తమకు సీట్లను కట్టబెట్టే అవకాశముందని ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటకలకు ప్రాధాన్యమిచ్చింది. చివరకు తన ఉనికే లేని కేరళ నుంచి కూడా ఒకరిని(అల్ఫోన్స్ కన్నన్ తానం) తీసుకుంది. కేరళలో ఆరెస్సెస్ కు వామపక్షాలకు మధ్య ఘర్షణల నేపథ్యంలో వాటిని సాకుగా తీసుకుని బలపడొచ్చనే నమ్మకమే దీనికి కారణం.