నో ప్రాబ్లం.. రూటు మార్చుకున్న మిడతల దండు - MicTv.in - Telugu News
mictv telugu

నో ప్రాబ్లం.. రూటు మార్చుకున్న మిడతల దండు

May 31, 2020

Locust

కరోనా వంటి కష్టకాలంలో తగుదునమ్మా అంటూ మిడతల దండు దేశంలోకి దూసుకువచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మిడతల ముప్పు ఉందని ప్రభుత్వాలు హెచ్చరించాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పచ్చని పంటలను సర్వనాశనం చేస్తాయని దిగులు చెందారు. మహారాష్ట్ర నుంచి అవి అదిలాబాద్, నిజామాబాద్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని తెలియగానే రైతుల్లో కలవరం మొదలైంది. తమ పంటలను ఎలా కాపాడుకోవాలోనని రంది పెట్టుకున్నారు. ఇది గమనించిన తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మిడతలపై దండయాత్ర చేయాలని నిర్ణయించుకుంది.  అదే సమయంలో వ్యవసాయ నిపుణులు కూడా మిడతల  దండు నుంచి విముక్తి పొందవచ్చని.. కంగారు పడాల్సిన అవసరం లేదన్న ధీమా వ్యక్తం చేశారు. దాంతో పాటు వారు కొన్ని  సూచనలు కూడా జారీ చేశారు.

ఇదిలావుండగా మిడతల కదలికలపై ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆదివారం ఏరియల్‌ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై మిడతల ప్రభావం లేదని.. రైతులు హైరానా చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మిడతల దండు దిశను మార్చుకున్నాయని.. తెలంగాణకు ముప్పులేదని చల్లని కబురు చెప్పారు. మిడతలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో మిడతల దండు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కమిటీ తెలిపింది.