No response to Rahul's trip in AP..why?
mictv telugu

ఏపీలో రాహుల్ యాత్రకు నో రెస్పాన్స్..ఎందుకిలా?

October 20, 2022

No response to Rahul's trip in AP..why?

ఏపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన లేదు.కార్యకర్తలు వస్తున్నా కీలక నేతలు పెద్దగా కనిపించడం లేదు.రాహుల్ తో మిగతా రాష్ట్రాల నేతలే కలిసి నడుస్తున్నారు. ఏపీలో రాగా యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కదలిక తెస్తుందా? కనీస పోటీ ఇచ్చేలానైనా కేడర్ లో జోష్ నింపుతుందా?

జాకీలు పెట్టి లేపినా..!

కాంగ్రెస్ పై ఏపీ వాసులకు ఇంకా కోపం పోనట్టుంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమంటూ ఇప్పటికీ రగిలిపోతున్నారు. అప్పట్లోనే కాంగ్రెస్ ని తుడిచిపెట్టేశారు.జాకీలు పెట్టి లేపిన లేవలేనంతగా విసిరికొట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆపార్టీ నేతలు పెద్దగా చేసిందేమిలేదు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు,నేతలు అప్పుడప్పుడు ధర్నాల పేరుతో కనిపిస్తున్నారు. అక్కడతోనే తప్ప అడుగు ముందుకు పడటం లేదు. ఇప్పుడు రాహుల్ రాకతోనైనా పార్టీ కేడర్‌లో ఉత్సాహం వస్తుందని అంతా అనుకున్నారు. కానీ రాగా యాత్రకు పెద్దగా రెస్పాన్స్ లేదు. రాహుల్ యాత్ర చేపట్టినా.. ఇంకెవరు ఏ కార్యక్రమం నిర్వహించినా.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కష్టం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నాలుగురోజులు..119 కిలోమటర్లు

ఏపీలో నాలుగురోజులపాటు రాహుల్ గాంధీ యాత్ర సాగుతోంది. వర్షంలో సైతం రాహుల్ నడక ఆపడం లేదు.ఊరారా తిరిగి కార్యకర్తల్ని పలకరిస్తున్నారు.అమరావతి రైతులతో రాహుల్ సమావేశమయ్యారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామన్నారు. ఏపీ లో రాహుల్ అన్ని కిలోమీటర్లు నడిచినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు రాహుల్ యాత్రపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. ఏపీకి భద్రాద్రి రాముడ్ని దూరం చేసిన రాహుల్ కు ఇక్కడ పర్యటించే అర్హత లేదన్నారు. కనీసం ఈ ఆరోపణలకు కూడా కాంగ్రెస్ నేతలు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు.

23న తెలంగాణలోకి

ఈ నెల 22న పాదయాత్ర మళ్లీ కర్ణాటకలోకి ప్రవేశించనుంది. 23న రాయచూర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించనుంది. రాహుల్ యాత్రకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు తెలంగాణ కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇక దీపావళితో 24, 25న భారత్ జోడో యాత్రకు రాహుల్‌ గాంధీ విరామం ఇవ్వనున్నారు. మళ్లీ 26 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3700 కిలోమీటర్లు సాగుతుంది.