NO SolidEvidence Farmhouse Case?
mictv telugu

వాళ్లు,వీళ్లు కాదు పోలీసులే అట్టర్ ఫ్లాపా..?

October 28, 2022

NO SolidEvidence Farmhouse Case?

ఫామ్‌హౌజ్ కేసులో పోలీసులు ట్రాక్ తప్పారా? సీన్ టు సీన్ ఫ్రేమ్ కన్‌స్ట్రక్షన్‌లో విఫలమయ్యారా? ఆధారాలు ఏమి సంపాందించకుండానే, లోతైన విచారణ చేయకుండానే రిమాండ్ చేయబోయి షాక్ తిన్నారా? ఇప్పుడు హైకోర్టులోనైనా లీగల్ ప్రొసీజర్స్ పక్కాగా ఫాలో అవుతారా? ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌లో వస్తున్న డౌట్లు క్లారిఫై చేయకుండానే అత్యుత్సాహం ప్రదర్శించారా?అసలు డబ్బు దొరికిందా?దొరికితే ఎక్కడ ఉంది?ఎఫ్ఐఆర్‌లో ఆ ప్రస్థావన ఎందుకులేదు?బీజేపీ లెవనెత్తిన ప్రశ్నలకు సైబరాబాద్ పోలీసులు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు.

అనుమానాలకేది ఆన్సర్..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు సైబరాబాద్ పోలీసులకు చుక్కులు చూపిస్తోంది. ఈ కేసులో వస్తున్న అనుమానాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొనుగోళ్ల కుట్ర జరిగిందన్న సైబరాబాద్ సీపీ… మీడియాతో మూడు ముక్కలు తప్ప ఏమిమాట్లాడలేదు. ఏ ఆధారాలు దొరికాయో చెప్పలేదు. సమాచారమిచ్చిన ఎమ్మెల్యేల్ని విచారించకుండానే ప్రగతిభవన్‌కు పంపారు. ఆతర్వాత రోహిత్ రెడ్డిని ఎస్కార్ట్ వాహనంలో తీసుకెళ్లారు. ఫామ్‌హౌస్‌లో ఎరవేసేందకు వచ్చారన్న రామచంద్రభారతి, నందకుమార్,సింహయాజి ఒకచోట,నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి మరోచోట ఉన్నారు. బయటకు కూడా వీరు వేర్వురుగా వున్న దృశ్యాలే బయటకొచ్చాయి. వీళ్లు కలిసినట్లు ఉన్న వీడియోలను పోలీసులు బయటపెట్టలేదు. సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేశారన్న ప్రచారం జరిగింది. ఆ వీడియోలు, ఫోన్ రికార్డింగ్స్ బయట పెట్టలేదు.

సాలిడ్ ఎవిడెన్స్ ఏది?

పక్కా ఆధారాలు లేకుండానే ఏసీబీ కోర్టుకు వెళ్లారు. కోర్టు రామచంద్రభారతి, నందు, సింహయాజులకు రిమాండ్ విధించాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. సరైన ఆధారాలు లేవని, వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. సీఆర్పీసీ 41 కింద నోటీసులచ్చి అరెస్టు చేయాలని జడ్జి ఆదేశించారు. ఆడియో క్లిపులను పోలీసులు కోర్టుకు గురువారం సమర్పించారు. టెక్నికల్ ఎవిడెన్స్‌గా భావించాలని కోరారు.కానీ ఇది సాలిడ్ ఎవిడెన్స్ కాదని ఏసీబీ కోర్టు తేల్చిచెప్పింది.ఏ కేసులోనైనా పక్కాగా వెళ్లే పోలీసులకు ఇప్పుడు ఏమైంది?

హైకోర్టులో సవాల్

ఏసీబీ కోర్టుకు రిమాండ్ తిరస్కరించడంతో తెలంగాణ హైకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు..సాధారణ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ పిటిషన్ పై శనివారం విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

ఆధారాల సేకరణ సవాల్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆధారాల సేకరణ సైబరాబాద్ పోలీసులకు సవాల్‌గా మారింది. 10నిమిషాల ఆడియోలో ప్రలోభాలపై క్లారిటీ లేదు. ఫామ్‌హౌజ్ రైడ్‌లో పక్కా ఆధారాలు దొరకలేదా? దొరికితే కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు. రిమాండ్ చేశాక..పోలీస్ కస్టడీ తీసుకుని మరిన్ని ఆధారాలు సేకరించాలనుకున్నారా?ఏసీబీ కోర్టు ఇచ్చిన షాక్ తో సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్లాన్ తిరగబడిందా? ఆ సంచుల గుట్టుని ఎందుకు విప్పలేకపోయారు.?

అధికారుల ప్రెస్ మీట్లు ఏమయ్యాయి

చిన్న చిన్న కేసులకు కూడా ప్రెస్ మీట్లు పెట్టి గంటకుపైగా వివరాలు అందించే తెలంగాణ పోలీసులకు ఇప్పుడు ఏమైంది. రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ఈ కేసుపై ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఒక్క కేసు..వంద అనుమానాలు వున్నా డీజేపీ ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు ఇవే ప్రశ్నల్ని బీజేపీ లెవనెత్తుతోంది. శనివారం హైకోర్టుకు సమర్పించబోయే ఆధారాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.