సీఏఏ అమలును ఏ రాష్ట్రం ఆపలేదు - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏ అమలును ఏ రాష్ట్రం ఆపలేదు

January 19, 2020

Kapil Sibal.

పార్లమెంటులో ఒకసారి చట్టంగా మారిన తర్వాత అమలుచేయాల్సిందేనని.. లేదంటే అది రాజ్యాంగ విరుద్ధ చర్య అవుతుందని సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)పై ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరుగుతున్న కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్(కేఎల్‌ఎఫ్‌)లో ఆయన పాల్గొని మాట్లాడారు. 

ఈ చట్టం అమలును రాష్ట్రాలు నిరాకరించే అవకాశమే లేదని తెలిపారు. మరోవైపు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చని.. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చు అని వెల్లడించారు. ‘ఈ చట్టం విషయంలో రాష్ట్రాలు చట్టాన్ని అమలు చేయబోమని మొండికేస్తే తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు విద్యార్థులు, పేద, అణగారిన వర్గాల ప్రజలే ముందుండి నడిపిస్తున్నారు. అందుకే ఈ ఆందోళనలపై ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తున్నారు’ అని ఆయన అన్నారు. 

ప్రధాని మోదీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ‘ప్రజలు దేశ అభివృద్ధిని కోరకుంటున్నారు. కానీ, మోదీ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయడంలేదు’ అని అన్నారు.కాగా, కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కేరళ, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి.