యుద్ధం వద్దు.. శాంతే ముద్దు: రష్యా పౌరులు - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం వద్దు.. శాంతే ముద్దు: రష్యా పౌరులు

February 25, 2022

ఉక్రెయిన్ దేశంపై రష్యా బలగాలు గురువారం నుంచి బాంబులతో విరుచుకుపడుతూ, ఇప్పటికే పలు ప్రాంతాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేస్తూ “యుద్ధం వద్దు – శాంతే ముద్దు” అంటూ డిమాండ్ చేశారు. ‘రష్యా దేశానికి, ఉక్రెయిన్ దేశంతో ప్రమాదం పొంచి ఉంది” అని చెప్పి, ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడటం ఏంటని పుతిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అభినవ హిట్లర్‌గా అభివర్ణిస్తూ భారీ స్థాయిలో రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ, భారీగా ర్యాలీలు చేపట్టారు.

 

దీంతో దేశ రాజధాని మాస్కో రోడ్లన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. మాస్కోలోని ప్రధాన వీధుల్లో దాదాపు 1,000 మందికి పైగా నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. యుద్ధం వద్దంటూ నినదించారు. మరికొందరైతే, పుతిన్ ఫోటోను హిట్లర్ మాదిరిగా మార్ఫింగ్ చేసి ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న పోలీసులు 54 నగరాల్లో దాదాపు 1,745 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 957 మంది మాస్కో నుంచి అదుపులోకి తీసుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.