Noida Baby Dies After Attack By Street Dog, Angry Residents Protest
mictv telugu

వీధి కుక్కల దాడిలో ఏడునెలల పసికందు మృతి

October 18, 2022

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సోమవారం దారుణం జరిగింది. రెక్కలకష్టంతో నెట్టుకొస్తున్న ఓ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది. కుక్కల దాడిలో తమ నెలల పసికందును పోగొట్టుకున్నది ఓ జంట. తల్లిదండ్రులు భవన నిర్మాణంలో కూలి పనులు చేసేందుకు వెళ్లగా ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ పసికందు పేగులు బయటకు రావడంతో ప్రాణాలు కోల్పోయింది. నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లోటస్ బౌలేవార్డ్ సెక్టార్ హండ్రెడ్ లో సోమవారం సాయంత్రం జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలిపని చేసుకునే ఓ కుటుంబం తమ ఏడు నెలల పాపతో అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీధి కుక్క ఆ చిన్నారిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శిశువును నోయిడాలోని యధార్ధ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. పసికందు పేగులు బయటకు రావడం వల్ల డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కలు దాడి చేయడం ఇది మొదటిసారి కాదని ప్రతి మూడు నెలలకోసారి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. నోయిడా అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ విషయంపై ఏఓఏ స్పందించారు. నోయిడా ఆధారిటీతో మాట్లాడానని ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.