ఢిల్లీలో 40 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేతకు 4 టన్నుల పేలుడు పదార్థాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో 40 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేతకు 4 టన్నుల పేలుడు పదార్థాలు

March 15, 2022

bfvfdv

నోయిడా సెక్టార్‌లో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాలను కూల్చివేయాడానికి అంతా సిద్ధమైంది. నాలుగు టన్నుల పేలుడు పదార్ధాలతో 9 సెకన్లలో భవనాలను కూల్చివేస్తామని నోయిడా అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇందుకు మే 22 వరకు గడువు విధించుకొని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. కూల్చివేత సమయంలో చుట్టుపక్కల ఉన్న 1500 కుటుంబాలను తాత్కాలికంగా ఖాళీ చేయిస్తామని, సమీపంలో ఉన్న నోయిడా రహదారిని గంట పాటు మూసేస్తామని వివరించారు. ఇప్పటికే భవనంలో ఉన్న ఎలక్ట్రికల్, ప్లంబింగ్, తలుపులు, కిటికీలు వంటివి తొలగిస్తున్నామని, కూల్చేటప్పుడు శిథిలాలు ఎగిరిపోకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, అక్రమ నిర్మాణంపై తొలుత అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగగా, కోర్టు కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. దాంతో నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయగా, అలహాబాద్ కోర్టు తీర్పును పునరుద్ఘాటించింది. దీంతో కూల్చివేత తప్పనిసరైంది. దాంతోపాటు బిల్డర్‌తో కుమ్మక్కయిన ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమంగా అంత పెద్ద భవనాలను నిర్మించారంటే అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. రెండు టవర్లలో ఫ్లాట్స్ తీసుకున్న యజమానులకు మొత్తం డబ్బును 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని నిర్మాణ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.