అంబులెన్స్‌లో గర్భిణీ 13 గంటల నరకం.. 8 ఆస్పత్రులు తిరిగినా.. - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్స్‌లో గర్భిణీ 13 గంటల నరకం.. 8 ఆస్పత్రులు తిరిగినా..

June 6, 2020

Pregnant.

ఉత్తరప్రదేశ్‌, నోయిడాలో ఘోరం చోటు చేసుకుంది. పురిటి నొప్పులు వచ్చిన మహిళను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకిరించారు. దీంతో ఆమె భర్త అంబులెన్స్‌లో పురిటి నొప్పులు పడుతున్న తన భార్యను తీసుకుని 13 గంటలపాటు 8 ఆసుపత్రులకు తిరిగాడు. అయినా ఏ ఒక్కరూ కనికరించలేదు. దీంతో ఆమె అంబులెన్స్‌లోనే కన్నుమూసింది. కొన్ని రోజుల్లో ఇంట్లో చిన్నారి కేరింతలు వింటానని ఆశపడ్డ ఆ తండ్రి అటు భార్యను, ఇటు ఇంకా లోకం చూడని పసిబిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరు అవుతున్నాడు. గౌతమ్‌బుద్దనగర్‌ జిల్లాలోని కోడా కాలనీలో వీజేందర్‌సింగ్‌, నలీమ్‌ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. నలీమ్(30) ఎనిమిదో నెల గర్భిణిగా ఉండగా, అనుకోకుండా పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో భర్త వీజేందర్‌సింగ్‌ అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మొదట ఒక ఆసుపత్రికి వెళ్లగా వారు సరిపడా బెడ్స్‌ లేవని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తప్పదన్నట్టు వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఓవైపు అంబులెన్స్‌లో భార్య పురిటి నొప్పులు పడుతుండటంతో భర్త తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. త్వరగా ఏ ఆసుపత్రిలోనైనా తన భార్యను చేర్చుకుంటే, కాన్పు అయిపోతుందని భావించాడు. 

కానీ, వెళ్లిన ప్రతీ ఆసుపత్రిలో ఏదో ఒక కారణం చెప్పి ఆమెను చేర్చుకోలేదు. అలా మొత్తం 13 గంటల్లో ఎనిమిది ఆసుపత్రులు తిరిగినా ఎవ్వరూ కనికరించలేదు. దీంతో నలీమ్‌ నొప్పులు తాళలేక ఆంబులెన్సులోనే మృతిచెందింద. ఈ ఘటనపై వీజేందర్‌సింగ్ మాట్లాడుతూ.. ‘మేము మొదట ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లాం. వారు నిరాకరించడంతో సెక్టార్ 30లోని చైల్డ్‌ పీజీఐ ఆసుపత్రికి, అక్కడి నుంచి షర్దా, జిమ్స్‌లకు వెళ్లాం. వాళ్లంతా నా భార్యను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రులైన జేయ్‌పీ, ఫోర్టీస్‌, మాక్స్‌ ఇన్‌ వైశాలిను ఆశ్రయించాను. వారూ నిరాకరించారు. అలా 13 గంటలు అంబులెన్సులో తిరిగాక చివరకు జిమ్స్‌లోనే ఆమెను చేర్పించాను. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా నా భార్య మృతిచెందింది’ అంటూ గండెలు బాదుకున్నాడు విజేందర్ సింగ్. ఈ ఘటనకు బంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ఎంతోమందిని కదిలిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా పాలనాధికారి సుహాస్‌ ఎల్‌వై దీనిపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ముఖ్య వైద్యాధికారి మునీంద్ర నేతృత్వంలో ఘటనకు కారణమైన ఆసుపత్రులపై విచారణ చేస్తున్నారు.  కాగా, ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రెండోసారి. మే 25 ఇలాంటి ఘటనలో ఒక పసికందు చనిపోయింది.