noida supertech twin towers set to be demolished today
mictv telugu

9 సెకన్లలో 40 అంతస్తుల బిల్డింగుల కూల్చివేత.. మరికొన్ని గంటల్లో

August 28, 2022

ప్రస్తుతం దేశ ప్రజల దృష్టి అంతా నోయిడాలోని ట్విన్‌టవర్స్‌పైనే ఉంది. సూపర్‌టెక్ సంస్థ నిర్మించిన ఈ జంట టవర్ల కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. నేటి మధ్యాహ్నం సరిగ్గా 2.30 గంటలకు అందరూ చూస్తుండగానే క్షణాల వ్యవధిలోనే నేలమట్టం కానున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ భవనాలను కూల్చివేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం భవనాల వద్దకు చేరుకున్న పోలీసులు ఈ భవనాలున్న ఎమరాల్డ్ కోర్టు సొసైటీలోని వేలాదిమందిని ఖాళీ చేయిస్తున్నారు. సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల టవర్ల కూల్చివేత ప్రక్రియను ఎడిఫిక్స్ ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది.

ఈ టవర్లలోని అన్ని ఫ్లోర్లకు పేలుడు పదార్థాలు గురువారమే అమర్చారు. నూరు మీటర్ల దూరం నుండి బటన్ నొక్కి ఈ జంట టవర్లను పేల్చివేయనున్నారు. ఇంత భారీ స్థాయి కూల్చివేత భారత్‌లో ఇదివరకెన్నడూ జరగలేదని, తమ సంస్థ ఆఫ్రికాలో ఇంకా పెద్ద టవర్లను కూల్చివేసిందని సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ మయూర్ మెహతా తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు టవర్ల కూల్చివేత ప్రక్రియను ప్రారంభిస్తామని, కూల్చివేత తర్వాత ధూళి 15 నిమిషాల వరకు మాత్రమే ఉంటుందని మెహతా చెప్పారు. అయితే పక్కనున్న భవనాలపై శిధిలాలు పడవని, ఒకవేళ శిధిలాలు చెదిరిపడినప్పటికీ నివాస భవనాలను ప్రత్యేక వస్త్రంతో కప్పేశామని చెప్పారు.

ఈ అక్రమ టవర్లను కూల్చివేయడానికి కనీసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చినట్లు ఎడిఫిక్స్ ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది. ట్రాఫిక్ ప్లానింగ్, నివాసాల్లోని ప్రజల తరలింపు, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. భవన నిర్మాణ నిబంధనలను అతిక్రమించినందువల్లే ఈ జంట టవర్లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆగస్టు 21నే వీటి కూల్చివేత పూర్తి కావలసి ఉన్నప్పటికీ నోయిడా అథారిటీ అభ్యర్థన వల్ల కూల్చివేతను ఆగస్టు 28కి వాయిదా వేశారు.