Noida Twin Towers demolished into ground in 10 seconds
mictv telugu

పేక మేడల్లా కుప్పకూలిన ట్విన్ టవర్స్.. మొత్తం 9 సెకన్లలోనే.. వీడియో

August 28, 2022

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో నిర్మించిన జంట భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ ట్విన్‌ టవర్స్‌ పేకమేడల్లా కుప్పకూలాయి. ముంబయికి చెందిన ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్‌ డిమాలిషన్స్‌ కలిసి ఈ పని చేపట్టాయి. పేలుడుకు 10 సెకన్లు పట్టింది. తర్వాత నాలుగైదు సెకన్లలో భవనాలు కిందపడిపోయాయి. గతంలో తెలంగాణ సచివాలయం, సెంట్రల్‌ జైలును, గుజరాత్‌లో పాత మొతెరా స్టేడియంను ఈ సంస్థే కూల్చింది. అయితే ఈ కూల్చివేతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆదివారం ఉదయమే అధికారులు పూర్తి చేశారు.

 

సూపర్‌టెక్ ట్విన్ టవర్ల చుట్టూ గాలి దిశ తూర్పు వైపుకు మారిందని, దీని వల్ల ధూళి కణాలు దిల్లీకి బదులుగా గ్రేటర్ నోయిడా, బులంద్‌షహర్ వైపు మళ్లుతాయని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా పశ్చిమ దిశగా గాలి వీస్తున్నప్పటికీ ఒక్కసారిగా మార్పు వచ్చిందని ఉత్తర్‌ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు.

జంట భవనాల చుట్టుపక్క భవనాల్లో నివసిస్తున్న 7,000 మందిని ఆదివారం ఉదయం 7 గంటలకే అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు స్థానిక పోలీసు అధికారులు. దాదాపు 2,500 వాహనాల్ని ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతానికి తీసుకెళ్లారు. అలాగే దగ్గర్లోని నివాసాలకు వంట గ్యాస్‌, విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వంట గ్యాస్‌, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించనున్నారు. పెంపుడు జంతువులు, వాహనాలను కూడా అక్కడి నుంచి తరలించారు.