Noida twin towers : Demolition is only the beginning, where will the waste go
mictv telugu

మొత్తానికి కూల్చేశారు.. మరి నెక్స్ట్ ఏంటి?

August 29, 2022

దేశ ప్రజలంతా ఆసక్తిగా చూస్తుండగానే ఢిల్లీ సమీపంలోని నోయిడాలో.. సూపర్‌టెక్ నిర్మాణ సంస్థ నిర్మించిన రెండు భారీ ఆకాశహర్మ్యాలను ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు అధికారులు కూల్చివేశారు. ‘అపెక్స్’, ‘సియానే’ అని పిలువబడే ఈ ట్విన్ టవర్స్‌ కేవలం 9 సెకన్లలోనే నేలమట్టమయ్యాయి. వీటిని పడగొట్టేందుకు 3700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఈ జంట భవనాల్లో అపెక్స్ టవర్‌లో 32 అంతస్తులు, సియానే టవర్‌లో 29 అంతస్తులు ఉన్నాయి. ఇవి దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని కుతుబ్ మీనార్ కన్నా పొడవైన భవనాలు.

దాదాపు 100 మీటర్ల ఎత్తయిన ఈ జంట భవనాలను ఉన్నచోటే అధికారులు కూల్చేశారు. ఇప్పుడు అధికారుల ముందు మరో అంశం సవాల్‌గా మారింది. ఈ బిల్డింగులను కూల్చిన తర్వాత వాటి వ్యర్థాలు, శిథిలాలు ఓ పర్వతంలా పేరుకుపోవడంతో వాటిని తొలగించడం అసలు సమస్యగా మారింది. ఆ గుట్టలో దాదాపు 55వేల టన్నుల మేర ఉంటాయని.. వీటిలో రాళ్లు, ఇనుపకడ్డీలు, ఉక్కు వంటివి ఉన్నట్టు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ మొత్తాన్ని తొలగించేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందని గతంలోనే అంచనా వేశారు. అధికారులు నిర్దేశించిన పలు ప్రదేశాల్లో ఈ శిథిలాలను తరలించనున్నారు. అయితే, ఈ టవర్స్‌ కూలిన సమయంలో పెద్ద ఎత్తున ఎగసిపడిన దుమ్మును నియంత్రించేందుకు అధికారులు వాటర్‌ స్ప్రింక్లర్లతో పాటు యాంటీ స్మాగ్‌ గన్‌లను ఘటనా స్థలానికి ఇప్పటికే తరలించారు.