శుభవార్త.. భారీగా తగ్గిన కరోనాయేతర మరణాలు
ప్రతి మందుకూ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి చాలా వరకు ముప్పును మరింత పెంచేవే. అయితే కొన్నిసార్లు ఈ సూత్రం తిరగబడి మంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా నమోదవుతున్నాయి. కరోనా విలయకాలంలోనూ అలాంటి కొంచి ఊపిరి పీల్చుకునే ఉదంతాలు నమోదవుతున్నాయి. అబ్బో, చెప్పొచ్చార్లెండి, కాలుష్యం తగ్గిందని, జింకలు నెమళ్లు రోడ్లపైకి వస్తున్నాయని చెప్తారు, అంతేగా అని పెదవి విరవకండి. వాటికంటే చాలా మంచి పరిణామాలు సాగుతున్నాయి.
ముఖ్యంగా కరోనాయేతర మరణాలు గణనీయంగా తగ్గాయి. లాక్‌డౌన్ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్న అందరికీ తెలిసిందే. దీంతోపాటు కాలుష్యం తగ్గడం, ప్రజలు ఇళ్లలో సరదాగా గడపడం, సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, ఆరోగ్యాన్ని పకడ్బందీగా సంరక్షించుకోవడం వంటి అనేకానేక కారణాల రక్తపోటు, గుండెపోటు ఇతర ఎమర్జెన్సీ కేసులు తగ్గిపోయాయి. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తీసిన లెక్కలే దీనికి ఉదాహరణ. గత మూడేళ్లలో మార్చిలో నెలలో నమోదైన మరణాలంకటే ఈసారి మరణాలు దాదాపు సగం తగ్గాయి. 2017 మార్చిలో 729 మంది, 2018 మార్చిలో 833 మంది, 2019 మార్చిలో 937 మంది కరోనాయేతర సమస్యలతో చనిపోగా, ఈ ఏడాది మార్చిలో ఆ సంఖ్య కేవలం 595గానే నమోదైంది. ముంబైతోపాటు దేశంలోని చాలా నగరాల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ కేసులు 50 నుంచి 60 శాతం తగ్గిపోయాయి.