అసలు దేశంలో న్యాయం ఉందా?..టెలికాం కంపెనీలపై సుప్రీం గరం - MicTv.in - Telugu News
mictv telugu

అసలు దేశంలో న్యాయం ఉందా?..టెలికాం కంపెనీలపై సుప్రీం గరం

February 14, 2020

airtel......

టెలికాం కంపెనీలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి ఏజీఆర్‌ ఛార్జీల కింద పడ్డ రూ.92,000 కోట్ల బకాయిలను ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. అయితే ఈ చెల్లింపుల కోసం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరుతూ టెలికాం కంపెనీలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటీషన్‌ను సర్వోత్తమ న్యాయస్థానం తోసిపుచ్చింది. కోర్టు ఆదేశాల్ని ఎందుకు పాటించలేదంటూ కడిగి పారేసింది. అసలు ఈ దేశంలో న్యాయం అనేది ఉందా అని ప్రశ్నించింది. బకాయిల చెల్లింపులో విఫలమైన టెలికాం కంపెనీలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు తెలపాలని టెలికాం శాఖపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలికమ్యూనికేషన్స్‌ సహా టెలికాం సంస్థలపై కోర్టు ధిక్కరణ అభియోగాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. 

బకాయిల చెల్లింపులపై ఒత్తిడి చేయరాదని కోరుతూ అటార్నీ జనరల్‌కు టెలికాం శాఖ డెస్క్‌ అధికారి లేఖ రాశారు. అయితే తనపై ఎందుకు చర్య తీసుకోరాదో వివరించాలని కోరుతూ ఆ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసును జారీ చేసింది. ఏజీఆర్‌ చెల్లింపులపై పలుసార్లు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు చెల్లింపులు చేపట్టలేదో మార్చి 17న కోర్టుకు హాజరై వివరించాలని ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలికమ్యూనికేషన్స్‌ సహా టెలికాం కంపెనీల ఎండీ, డైరెక్టర్లందరికీ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో తెలపాలని ఆదేశించడం కొసమెరపు.