క్యాన్సర్ రోగిపై  ధనలక్ష్మి కరుణ.. రూ.1.42 కోట్లు గెలిచాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

క్యాన్సర్ రోగిపై  ధనలక్ష్మి కరుణ.. రూ.1.42 కోట్లు గెలిచాడు..

October 30, 2019

lottery.

మనం అనుకున్నప్పుడు అదృష్టం రమ్మన్నా రాదు. దానికదే వచ్చి మన ఒళ్లో వాలినప్పుడు ఆశ్చర్యపోవడం, ఆనందించడం మన వంతు అవుతుంది. అలాంటి అదృష్టం మనం పుట్టెడు కష్టాల్లో ఉన్నప్పుడు వరిస్తే ఎలా ఉంటుంది? చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదూ. అలాంటి అనుభవం ఓ సామాన్యుడికి ఎదురైంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న అతను కీమోథెరపీ చేయించుకుంటున్నాడు. జీవితంపై ఆశల్లేవు. జబ్బు తగ్గుముఖం పట్టినప్పటికీ బాగా కుంగిపోయాడు. ఈ క్రమంలో అతను సరదాగా కొన్న లాటరీ టికెట్ కోట్ల రూపాయలు కట్టబెట్టింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

అమెరికాకు చెందిన రానీ ఫార్స్టర్, నార్త్‌కెరొలీనా రాష్ట్రంలోని పింక్ హిల్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. రానీ కోలాన్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కీమో థెరపీ చికిత్స చేయించుకుంటున్నాడు. ఫలితంగా అతని వ్యాధి తగ్గుముఖం పడుతోంది. ఇటీవల తన చివరి కీమో సెషన్‌కు వెళ్లే సమయంలో.. కారులో ప్రెట్రోల్ పోయించుకునేందుకు ఓ ప్రెట్రోల్ బంక్ వద్ద ఆగాడు. అక్కడ ఓ లాటరీ టిక్కెట్ కొనాలనే ఆలోచన అతడికి అకస్మాత్తుగా కలిగింది. ప్రయత్నిద్దాం అనుకుని డాలర్ పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. టిక్కెట్‌ను స్క్రాచ్ చేసి చూస్తే 5 డాలర్లు గెలిచినట్టు వచ్చింది. దీంతో రానీలో మరింత ఉత్సాహం పెరిగింది. వెంటనే ఆ డబ్బుతో మరో రెండు టిక్కెట్లు కొన్నాడు. 

మొదటి టిక్కెట్టును స్క్రాచ్ చేస్తే..‘బెటర్ లక్ నెక్స్ట్ టైమ్’ అని వచ్చింది. నిరాశ చెందరకుండా రెండో టికెట్ స్క్రాచ్ చేసి చూశాడు. అంతే అద్భుతం.. అతను ఊహించని విధంగా టికెట్‌పై నంబర్లు కనిపించాయి. రూ.1.42 కోట్ల రూపాయలు లాటరీలో అతను గెలుపొందాడు. దీంతో అతను అక్కడే ఎగిరి గంతేశాడు. తన నిరాశ, నిస్పృహలను వదిలేసి ఈ డబ్బుతో జీవితాన్ని ఆనందంగా గడుపుదామని అనుకున్నాడు.