హిట్లర్, స్టాలిన్, ముస్సోలినీ వంటి నియంతలు లేని కొరత తీరుస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ పాలన రానురాను కర్కశంగా మారుతోంది. పిల్లలకు బాంబు, గన్, శాటిలైట్ పేర్లు పెట్టాలని ప్రజలను ఆదేశించిన కిమ్ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉందో చెప్పే ఉదంతమొకటి వెలుగు చూసింది. పలు మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. శత్రుదేశాలైన దక్షిణ కొరియా, అమెరికాల సినిమాలు చూసిన ఇద్దరు ఉత్తర కొరియా మైనర్ బాలురను బహిరంగంగా కాల్చి చంపారు.
ఉత్తర కొరియా చట్టాల ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు చూడడం పాపం, నిషిద్ధం. ర్యాన్గాంగ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు హైస్కూలు విద్యార్థులు ఇటీవల దక్షిణ కొరియాలో నిర్మించిన కే-డ్రామాస్ వెబ్ సిరీస్‌తోపాటు కొన్ని సినిమాలు, అమెరికా టీవీ కార్యక్రమాలు చేశారు. అంతటితో ఊరుకోకుండా వాటిని షేర్ చేసి, అమ్మారు. కిమ్ అధికారులకు విషయం తెలిసి మరణశిక్ష విధించారు. ఆ పిల్లలను హైసేన్ వైమానిక స్థావరం దగ్గరికి తీసుకెళ్లి బహిరంగంగా కాల్చి చంపారు. అంతేకాకుండా శిక్ష అమలు చేస్తున్నప్పుడు అందరూ చూడాలని స్థానిక ప్రజలను అక్కడికి పట్టుకొచ్చారు. ఈ వార్త బయటికి పొక్కడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కిమ్ పాశ్చాత్య సంస్కృతిని ఏమాత్రం సహించడన్న సంగతి తెలిసిందే. గత ఏడాది తన తండ్రి వర్ధంతి సందర్భంగా ప్రజలు నవ్వకూడదని, షాపింగ్, చేయొద్దని, మద్యం తాగకూడదని ఆయన ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.