వినడానికి వింతగా ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. నియంతల దేశాల్లో ఇలాంటి విడ్డారాలెన్నో జరుగుతుంటాయి. చైనాలో ఫేస్బుక్ ఉండదు. గూగుల్ కూడా పూర్తిగా యాక్సెస్ కాదు. ఆ దేశమే తయారు చేసి ప్రపంచమ్మీది వదిలిన టిక్‌టాక్ కూడా ఉండదు. వాటికి మాండరిన్ భాషల్లో తమదైన వెర్షన్లు క్రియేట్ చేసిన వాటిని మాత్రమే వాడాలని ప్రజలను ఆదేశిస్తుంటారు.
చైనా పెద్దన్న అయితే ఉత్తర కొరియా బుల్లి అన్నయ్య. కిమ్ జోంగ్ ఉన్ ఏకపక్షంగా పాలిస్తున్న ఉత్తర కొరియాలోనూ ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయి. తన కూతురు పేరు పెట్టుకున్నవాళ్లందరూ వెంటనే పేరు మార్చుకోవాలని, జీన్స్ ప్యాంట్లు, జులపాల హెయిర్ కట్ ఉండకూడదని కిమ్ ఆదేశించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతకుమించిన ఘోరమైన వార్తకొకటి తాజా వెలుగు చూసింది.
ఉత్తర కొరియా గూఢచర్య విభాగంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కిమ్ గురించి గూగుల్లో ఏముందుదో సెర్చ్ చేసి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం అతనికి మరణశిక్ష విధించారు. రేపోమాపో ఈ శిక్షను అమలు చేయనున్నారని దక్షిణ కొరియా మీడియా తెలిపింది. ఉత్తర కొరియాలో ప్రజలైనా, ఉద్యోగులాన ప్రభుత్వం సెన్సార్ చేసిన ఇంటర్నెట్ కంటెంట్ మాత్రమే వాడుకోవాలి.
గూఢచర్య విభాగం ‘బ్యూరో 10 బాడీ’కు చెందిన పలువురు ఏజెంట్లు పనిలో భాగంగానో, లేకపోతే ఎవరు కనుక్కుంటార్లే అన్న ధీమాతోనో అనుమతి లేకుండా గూగుల్‌లో సెర్చ్ చేశారు. లక్ష కళ్లుండే నిఘా అధికారులకు ఈ విషయం తెలిసింది. వారిని వెంటనే పదవు నుంచి తప్పించారు. కిమ్ గురించి గూగుల్ చేసిన ఉద్యోగికి మరణశిక్ష విధించారు. కిమ్ ఏజెంట్లు మరింత సమాచారం కోసం గూగుల్ చేస్తున్నారని, అయితే ఎక్కడో ఏదో బెడిసికొట్టి ఇలా పట్టుబడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.