యుద్ధం తప్పదా? - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం తప్పదా?

September 7, 2017

ఉత్తర కొరియాపై కొరకొరలాడుతున్న అమెరికా, కిమ్ వ్యాఖ్యలపై ఘాటుగా రెస్పాండ్ అయినా చర్యలు తీసుకోవడంలేదు ఎందుకు? అనే ప్రశ్న చాలా మందిలో  వస్తున్నది.అమెరికాను సుస్సు పోయిస్తున్నాడు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్… అమెరికా, దక్షిణ కొరియాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. మీరు మాటలు మాట్లాడితే తాను చేతల్లో చూపిస్తానని క్షిపణుల ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. దక్షిణ కొరియా  ముఖ్య పట్టణం సియోల్ కు సమీపంలో యుద్ద ట్యాంకులు… ఫిరంగులు మోహరించాడు. అయినా  అమెరికా యుద్ద విమానాలు ఇంకా సిద్దం కావడం లేదు ఎందుకంటే..

ఉత్తర కొరియాను ఏ మాత్రం కదిలించినా తన మిత్ర దేశం దక్షిణ కొరియాపై నార్త్ కొరియా విరుచుకు పడుతుందనే భయమే ప్రధాన కారణం  అని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.  ఇంకా చెప్పాలంటే  కిమ్ హైడ్రోజన్ బాంబు ప్రయోగించిన వెంటనే అమెరికా ఏదో ఒకటి చేస్తుందని చాలా మంది అనుకున్నారు.  ఐక్యరాజ్య సమితి చేత ఒకటి రెండు మాటలు అన్పించారు. పద్దతి కాదని చెప్పి చూశారు. అయినా కిమ్ వెనకడుగు వేయడం లేదు. మిత్ర దేశాలు ఆంక్షలు విధించినా కిమ్ కామ్ గా తన పని తాను చేసుకు పోతున్నాడు.

అంతే కాదు అమెరికా విధ్వంసం అయినట్లు వీడియోలు కూడా క్రియేట్ చేసి చూపిస్తున్నాడు.  కదిలిస్తే కయ్యానికి రెఢీ అనేట్లున్నాడు ఈ యంగ్ లీడర్. ప్రపంచ వ్యాప్తంగా  ఇతని పేరుమీద వార్తలు రాని రోజంటూ లేదు. ప్రపంచ మీడియా  మొత్తం కిమ్ పేరును జపిస్తున్నది. ఒకవేళ కిమ్  దుందుడుకు చర్యలు మరింత పెంచితే సియోల్ ను రెండున్నర కోట్ల మందిపై ప్రభావం ఉంటుందని  అమెరికా అనుకుంటున్నదట.  అందుకే కిమ్  మాట్లాడుతున్నా… హెచ్చరికలు చేస్తున్నా ఏమీ అనడం లేదు.

దానికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో చిన్న సంక్షోభం వచ్చినా ప్రపంచ  ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులవుతాయి. ఉద్యోగులపై  తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉత్తర  కొరియా నుండి  చాలా దేశాలకు ఎమగుతులు, దిగుమతులు ఉన్నాయి. హైడ్రోజన్ బాంబు ప్రయోగం గురించి వార్తలు వచ్చిన వెంటనే బంగారం ధరలు బాగా పెరిగాయి. ఇక యుద్దం అంటూ వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే యుద్దాని కంటే  ఊరికే ఉండటం బెటర్ అని ప్రపంచం అంతా అనుకుంటున్నది. ఇవన్నీ కూడా కిమ్ ఎగిరి పడేందుకు బాగా దోహదం చేస్తున్నట్లుంది. అంతే నష్టం ఉత్తర  కొరియాకూ ఉంటుంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దూసుకు పోతున్న కిమ్  ఈ ప్రపంచ గమనాన్ని ఏం చేస్తాడో మరి.