Not a single phone has Pegasus spyware: Supreme Court
mictv telugu

ఒక్క ఫోన్‌లో కూడా పెగాస‌స్ స్పైవేర్ లేదు: సుప్రీంకోర్టు

August 25, 2022

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) పెగాస‌స్ విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన క‌మిటీ రిపోర్ట్‌పై గురువారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. విచారణలో భాగంగా సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ..’29 ఫోన్ల‌ను ప‌రీక్షించాము. దాంట్లో అయిదు ఫోన్ల‌లో మాల్‌వేర్ ఉన్న‌ట్లు గమనించాం. కానీ, ఒక్క ఫోన్‌లో కూడా పెగాస‌స్ స్పైవేర్ ఉన్న‌ట్లు గుర్తించ‌లేదు’ అని అన్నారు. అయితే, ఈ పెగాస‌స్ అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డంలేద‌ని చీఫ్ జ‌స్టిస్ వెల్ల‌డించారు.

”సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన క‌మిటీనే ఈ రిపోర్ట్‌ను త‌యారు చేస్తోంది. మూడు భాగాలుగా రిపోర్ట్‌ను ఇవ్వ‌నున్నారు. దీంట్లో రెండు టెక్నిక‌ల్ క‌మిటీ రిపోర్ట్‌లు ఉంటాయి. రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ ఆర్వీ ర‌వీంద్ర‌న్ మ‌రో నివేదిక‌ను స‌మ‌ర్పిస్తారు. ర‌వీంద్ర‌న్ స‌మ‌ర్పించే నివేదిక‌ను వెబ్‌సైట్‌లో ప‌బ్లిక్‌గా పెట్ట‌నున్నాం” అని సీజేఐ తెలిపారు. అనంతరం తొలి రెండు భాగాల‌కు చెందిన రిపోర్ట్ కావాల‌ని కొంద‌రు పిటిష‌నర్లు అడగ్గా.. దానిపై ప‌రిశీలిస్తామ‌ని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసు విచార‌ణ‌ను మ‌రో నాలుగు వారాల‌కు వాయిదా వేశారు. కేసును విచారించిన ధ‌ర్మాస‌నంలో.. సీజేఐ ర‌మ‌ణ‌తోపాటు జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు.

ఇక, పెగాసస్ స్పైవేర్ విషయానికొస్తే..”అత్యంత శక్తివంతమైనదిగా టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే.. ఫోన్ యూజర్ ఎలాంటి లింక్ ఓపెన్ చేయకపోయినా, అసలు ఆ వ్యక్తి ప్రమేయం లేకపోయినా, పెగాసస్‌ స్పైవేర్ మొబైల్‌ని హ్యాక్ చేసేస్తుంది. ‘పెగాసస్‌’ స్పైవేర్ ఒక్కసారి మొబైల్ ఫోన్ లోకి చొరబడితే, అది మొబైల్ యజమాని కంటే ఎక్కువ కంట్రోల్ కలిగి ఉంటుంది. పెగాసస్‌ ఐఫోన్‌లోకి చొరబడిన క్షణాల్లోనే కీలకమైన అధికారాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత కాంటాక్ట్ లిస్టు, మెసేజెస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ వంటి అన్ని విషయాలనూ యాక్సెస్ చేస్తుంది. ఆ విషయాలన్నిటినీ హ్యాకర్‌కి చేరవేస్తుంది” నిపుణులు గతంలో వెల్లడించారు.