ఇటీవల ఏపీలో కాబోయే భర్తను కళ్లు మూసుకోమని చెప్పి సర్ప్రైజ్ ఇస్తానని ఓ యువతి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇంచుమించుగా అలాంటి ఘటనే జార్ఖండ్‌లోని జామ్తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్భితా గ్రామంలో వెలుగు చూసింది. హెంబ్రోమ్ అనే మహిళ శనివారం రాత్రి జీన్స్ ప్యాంటు ధరించి పక్క గ్రామం గోపాల్పూర్ లో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది.
అయితే, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె జీన్స్ వేసుకోవడంపై దంపతులు ఇద్దరూ గొడవపడ్డారు. పెళ్లి తర్వాత జీన్స్ ఎందుకు ధరించావని భర్త ప్రశ్నించడంతో చెలరేగిన ఘర్షణ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటా మాటా పెరిగే దాకా వెళ్లింది. దీంతో ఆవేశానికి గురైన పుష్ప.. భర్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ధన్‌బాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడు, కోడలి మధ్య జీన్స్ ధరించే విషయంలో గొడవ జరగడంతో ఆమె కత్తితో పొడిచి చంపినట్టు మృతుడి తండ్రి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.