నోటాకు ఓట్లు పడలేదు.. కానీ విజయ్ గెలిచాడు..(నోటా మూవీ రివ్యూ) - MicTv.in - Telugu News
mictv telugu

నోటాకు ఓట్లు పడలేదు.. కానీ విజయ్ గెలిచాడు..(నోటా మూవీ రివ్యూ)

October 5, 2018

నో డౌట్.. విజయ్ దేవరకొండ నటనను ఎక్కడా తప్పుపట్టానికి వీల్లేదు. కానీ నటనకు సరైన కథ, కథనం గట్రా దినుసులు కూడా కుదిరితేనే సినిమా హిట్ అవుతుంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం విజయాల తర్వాత నోటాతో ఈ రోజు మళ్లీ మనముందుకొచ్చిన విజయ్ స్క్రీనంతా తానే పరిచేసుకున్నాడు. జాలీగా, సీరియస్‌గా, ఎమోషనల్‌గా, కన్నింగ్‌గా  తనకు కేటాయించిన సన్నివేశాల్లో చెలరేగిపోయాడు. మూవీలో విజయ్ ఉంటే జనం థియేటర్లకు వచ్చి తీరతారన్న టాక్‌ను నిజం చేశాడు. 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు విజయ్ చలవతో నష్టాలు మటుకు రావు..

కానీ.. నోటాలో చెప్పుకోవడానికి పెద్దగా కథేమీ లేకపోవడం సినిమాకు మైనస్ పాయింటయ్యింది. సమకాలీన రాజకీయాలను దెప్పిపొడిచినా మరీ కథ నాటకీయంగా సాగడం వల్ల ప్రేక్షకులు కన్విన్స్ కాలేదు. విజయ్, నాజర్, సత్యరాజ్ వంటి దిగ్గజాలు శాయశక్తులా కృషి చేసిన అతుకుల బొంతలాంటి కథ, అతి సినిమాటిక్ సన్నివేశాలు, రొమాన్స్ అసల్లేకపోవడం విజయ్ నుంచి ఏదో ఏదో  ఆశించే కుర్రకారును నీరుగార్చింది. పైగా లుంగీలు, కాళ్లపైన పడి వేడుకోవడం, జయలలిత డెత్ బెడ్ ఆస్పత్రి పాలిటిక్స్, జనాల అరుపులు వగైరా తమిళ వాసనలు, కృతక సంభాషణలు.. సహజంగా ఉండాల్సినదాన్ని మింగేశాయి. అయినా విజయ్ కరిజ్మాతో ఫస్టాఫ్‌లో ఆ లోపాలను కనిపించకుండా నెట్టుకొచ్చారు. సెకండాఫ్‌లో మాత్రం కథను పనామా వరకు లాగి లాగి నమ్మశక్యం కాని మలుపులతో ముగించేసి చేతులెత్తేశారు. ఇది విజయ్ చేయాల్సిన డబ్బింగ్ సినిమా కాదని, విజయ్ రాజకీయాలకంటే అమ్మాయిలకే బాగా పనికొస్తాడని సీట్లలోంచి లేచి వెళ్తున్న జనం చెప్పుకోవడం వినిపించింది.

విలాసాల నుంచి బాధ్యతల్లోకి

నోటాను పోలిన దూకుడు సీఎంల కథలు టాలీవుడ్‌కు కొత్త కాదు, కోలీవుడ్‌కు అసలు కొత్తకాదు. అంకుశం, కర్తవ్యం నుంచి నిన్నటి లీడర్, భరత్ అనే నేను వరకు బోలెడొచ్చాయి. నోటా కథ కూడా అలాంటిదే. మందు, చిందు, మగువలతో విలాసంగా జీవితం గడిపే కుర్రోడు.. అనుకోని పరిస్థితుల్లో సీఎం కావడం, తర్వాత అందులో చిక్కుకుపోవడం, ఆ తర్వాత ప్రజలకు సేవ చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవడం.. ఇదీ కథ. విజయ్ ఈ అన్ని షేడ్లలో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. కానీ ఈ రౌడీ సీఎం ఒంటిచేయి బలం చాలలేదు. అందుకే  రొటీన్ పొటికల్ స్టోరీగా మిగిలిపోయింది.

ముఖ్యమంత్రి వాసుదేవరావు(నాజర్) అవినీతి కేసులో చిక్కుకుంటాడు. ముందుజాగ్రత్తగా విధిలేని పరిస్థితిలో తన కొడుకు, వీడియో గేమ్ డిజైనర్ వరుణ్(విజయ్ దేవరకొండ)ను సీఎంను చేస్తాడు. అప్పుడే లండన్ నుంచి వచ్చిన వరుణ్ ఇష్టం లేకపోయినా రెండువారాలేగా అని ఒప్పేసుకుంటాడు. తర్వాత వాసుదేవ్ అరెస్టయి, జైలుకెళ్లడంతో వరుణ్ సీఎం సీటుకు అతుక్కుపోవాల్సి వస్తుంది. దూకుడు నిర్ణయాలతో రాష్ట్ర అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుని శాంతిభద్రతలను పరిరక్షిస్తాడు. మరోపక్క.. వాసుదేవ్ సంపాదించిన వేల కోట్ల ఆస్తుల కోసం ఓ స్వామీజీ కుట్రపన్నుతాడు. జైలు నుంచి బయటికొచ్చిన వాసుదేవ్‌పై డ్రోన్ బాంబుతో దాడి చేయిస్తాడు. వాసుదేవ్ కోమాలోకి వెళ్తాడు. వరుణ్ సీఎంగా విధులు నిర్వహించడంలో సీనియర్ జర్నలిస్టు మహేంద్ర(సత్యరాజ్).. బాహబలికి కట్టప్పలా సాయపడతాడు. ఇంతలో వాసుదేవ్ కోమాలోంచి బయటికొచ్చి కొడుకును దెబ్బకొట్టి మళ్లీ తానే సీఎం కావడానికి పావులు కదుపుతాడు. రిసార్టు రాజకీయాలు గట్రా నడుస్తాయి. తండ్రి ధోరణి నచ్చని వరుణ్ అతనికి ఎలా చెక్ పెట్టాడు, విదేశాల్లోని వేలకోట్లను ఎలా దారికి తెచ్చుకున్నాడన్నది మిగతా కథ.

నచ్చేవి..

విజయ్ నటన మెస్మరైజ్ చేస్తుంది. మందు, విందుల్లో చెలరేగే కుర్రాడిగా జీవించేశాడు. ప్రజల కోసం తపన పడే సీఎంగా ఆకట్టుకుంటాడు. వార్ రూమ్ సీన్లు మెప్పిస్తాయి. ‘రాజకీయాల్లో పంచెలు గట్టిగా కట్టుకోవాలి.. లేకపోతూ ఊడిపోతాయ్…’ వంటి పంచ్ డైలాగులు మెప్పిస్తాయి. వరుణ్ తనకు పుట్టిన కొడుకేనా అని వాసుదేవ్ అనుమానపడ్డం, అతని పదవీ కాంక్ష చాలామంది బడా నేతలను గుర్తుకు తెస్తాయి. రాజకీయాలపై చురుక్కుమనే విమర్శలు బాగా పండాయి. ఫస్టాఫ్ అనూహ్య మలుపులు, గ్రిప్పింగ్ సీన్లతో సాగుతుంది.

నచ్చనివి..

చాలా సన్నివేశాలు కృతకంగా ఉంటాయి. సీఎం పెరటి గోడ దూకి పార్టీకి వెళ్లడం, ముఖద్వారం నుంచి తప్పించుకోవడం, విడుదలైన డ్యాం నీటి ముప్పు నుంచి కేవలం నాలుగంటల్లో అర్ధరాత్రి సోషల్ మీడియా గట్రా సాయంతో ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించడం వింతగా అనిపిస్తుంది. మహేంద్ర ఫ్లాష్ బ్యాక్ కథకు కీలకమే అయినా ఆ ముసలి సత్యరాజ్‌ను 70లలోకి తీసుకెళ్లి చూపిన అతని కుర్ర లవ్ స్టోరీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. మహేంద్ర, వాసుదేవరావు, అతని భార్య ట్రాయాంగిల్ ప్రేమ కథను సినిమా ముగింపు కోసం బలవంతంగా తీసుకొచ్చి కూరినట్లు అనిపిస్తుంది. ఉన్న రెండు పాటలు కూడా గందరగోళంగా సాగుతాయి. మెహరీన్ ఈ సినిమాలో అనవసరం అనిపిస్తుంది. విలేకరిగా ఆమె గట్టిగా ఐదు నిమిషాలకు మించి కనిపించదు. మరోపక్క.. విపక్ష నేత కూతురు.. రౌడీకి సీఎంకు క్లాస్‌మేట్ కావడం, అతని పతనం చూడాలని కంకణం కట్టుకున్న ఆమె మనసు మార్చుకుని అతణ్ని సీక్రెట్ దాచడం కథ అని సరిపెట్టుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ సంగీత్  కూడా యావరేజ్. ఈ సినిమాకు నోటా అని పేరెందుకు పెట్టారో ఒకపట్టాన అర్థం కాదు. దర్శకుడు ఆనంద్ శంకర్.. సినిమా ఎడిటింగ్‌పై శ్రద్ధపెట్టాడా లేదా అన్న అనుమానం కలుగుతుంది. కేవలం విజయ్‌ని నమ్ముకుని ఒక ఫ్లాట్ పొలిటికల్ మూవీని తీయడం సులువైన వ్యవహారం కాదు. విజయ్ ఇకపై ఇలాంటి కథల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే రొటీన్ రొంపిలో కూరుకుపోతాడన్న హెచ్చరిక ఈ సినిమా.

కంక్లూజన్.. విజయ్ దేవరకొండ కోసం ఫస్టాఫ్ చూసి ఇంటర్వెల్లో ఇంటికి వచ్చేయొచ్చు.. అర్జున్ రెడ్డి, గీత గోవిందంలతో వైకుంఠపాలీలో పెద్ద నిచ్చెనను ఎక్కిన విజయ్‌ని.. ఎన్నికల్లో గెలవలేని నోటా మింగేసింది.. ఇది ఎన్నికలను ప్రభావితం చేసే సినిమా కానే కాదు.. దీనిపై కోర్టుకెళ్లడం శుద్ధదండగ. ఈ డ్రామాను తట్టుకునే శక్తిసామర్థ్యాలు తమిళల ప్రేక్షకులకు దండిగా ఉంటాయి కానీ మన తెలుగు ప్రేక్షకులు మాత్రం చాలా కష్టం.