Note to Candidates..AMVI Notification Cancellation
mictv telugu

అభ్యర్థులకు గమనిక..ఏఎంవీఐ నోటిఫికేషన్ రద్దు

September 4, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతకొన్ని నెలలుగా నిరుద్యోగ యువతకు శుభవార్తల మీద శుభవార్తలు చెప్తూనే ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,089 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన రోజు నుంచి ఈరోజు వరకు ఉద్యోగ నియామక ప్రక్రియ చకచకా సాగుతుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 52,460 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అందులో 19,359 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చాయి. తాజాగా 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులతో కలిపి ఆ సంఖ్య 20,899కి చేరింది.

అయితే, రవాణాశాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) నోటిఫికేషన్‌కు సంబంధించి, టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. తెలంగాణలో ఏఎంవీఐ నోటిఫికేషన్ రద్దు చేస్తూ, ఓ ప్రకటన విడుదల చేశారు. నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేశామనే కారణాలను కూడా అభ్యర్థులకు ఆయన తెలియజేశారు.

”అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలనే నిబంధనపై ఎక్కువ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. అభ్యర్థుల విజ్ఞప్తులను అర్థం చేసుకొని, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నాం. ఇదే విషయాన్ని రవాణాశాఖకు కూడా తెలియజేశాం. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తాం. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి” అని ఆయన అన్నారు.