వాహనదారులకు గమనిక.. ఇకపై హారన్ కొడితే, జేబు ఖాళీ - MicTv.in - Telugu News
mictv telugu

వాహనదారులకు గమనిక.. ఇకపై హారన్ కొడితే, జేబు ఖాళీ

June 8, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని వాహనదారులకు పోలీసు అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఇష్టమొచ్చినట్లు హారన్ కొడితే జేబుకు చిల్లు పడుతుందని హెచ్చరించారు. పరిమితిని మించి హారన్లు కొడితే వాహనదారులు భారీ జరిమానాలు చెల్లించక తప్పదని ఓ ప్రకటన విడుదల చేశారు.

”హారన్లతో హైదరాబాద్ నగరం అధికంగా శబ్ద కాలుష్యం అవుతుంది. ఈ హారన్లలో మార్పు తీసుకురావాలని నగర ట్రాఫిక్ పోలీసులం కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. సిగ్నళ్ల వద్ద, ట్రాఫిక్ జామ్ అయిన చోట పదే పదే శబ్ధం చేస్తూ, ఇతరులు  ఇబ్బందిపడే పరిస్థితిని కల్పించేవారి కోసం అత్యాధునిక కెమెరాలను జర్మనీ నుంచి తెప్పిస్తున్నాం. వీటి ఆధారంగా జంక్షన్ల వద్ద అవసరం లేకున్నా హారన్లు కొట్టే, వాహనదారులను గుర్తించి, భారీ జరిమానాను విధిస్తాం. ఈ కెమెరాలు వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ముందుగానే హహనాదారులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం.”

హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం చీఫ్ ఏవీ. రంగనాథ్ మాట్లాడుతూ..” బైకులు, కార్లు, ఇతర వాహనాల్లో సాధారణ హారన్లు బిగించినా, ఇష్టానుసారంగా హారన్లు వినియోగించేనా, వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాజధానిలో 200కు పైగా కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్లలో వాహనాలు కొద్ది సేపు ఆగాల్సి వస్తోంది. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత ఒక్కసారిగా జంక్షన్ దాటడానికి వాహనదారులు ఇష్టానుసారంగా హారన్లు మీద హారన్లు కొడుతున్నారు. కొన్ని సిగ్నళ్ల వద్ద భారీ శబ్ద కాలుష్యం అధిక స్థాయిలో నమోదవుతోంది. వెంటనే ఈ సమస్యను నిరోధించాలని ఈ నిర్ణయానికి వచ్చాం” అని ఆయన అన్నారు.