ప్రయాణికులకు గమనిక.. టికెట్‌ రేట్లు 10-15శాతం పెరిగాయి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికులకు గమనిక.. టికెట్‌ రేట్లు 10-15శాతం పెరిగాయి

June 16, 2022

విమాన ప్రయాణికులకు దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణాన్ని అందిస్తున్న విమాన సంస్ధగా పేరుగాంచిన స్పైస్‌ జెట్‌ టికెట్ రేట్లను 10 నుంచి 15 శాతం పెంచుతున్నట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది. నిర్వహణ వ్యయం అధికమవడంతో ఈ టికెట్‌ ధరలను పెంచుతూ, నిర్ణయం తీసుకున్నామని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. విమాన ఇంధన ధరలు నానాటికీ పెరుగుతోన్న క్రమంలో నిర్వహణ ఖర్చులను భరించాలంటే టికెట్ ధరలను తక్షణమే పెంచక తప్పదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్‌ ధరలు పెంచాల్సి వచ్చిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ తెలిపారు. టికెట్ రేట్లను పెంచడం ద్వారా తమకు కొంతవరకు భారం తగ్గుతుందని ఆయన అన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..”2021 జూన్‌ 21 తర్వాత ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ రెట్లు 120 శాతం అధికమైంది. ఇది మోయలేని భారంగా మారింది. నిర్వహణ వ్యయంలో ఇదే 50 శాతం ఉంటుంది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులను తగ్గించుకోవాలి. అదేవిధంగా రూపాయి విలువ పడిపోవడం కూడా మాపై ప్రభావం చూపుతుంది” అని ఆయన అన్నారు.


మరోపక్క కరోనా టైంలో లాక్‌డౌన్ కారణంగా విమనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే 25, 2020 నుంచి దశల వారీగా విమాన సర్వీసులను ప్రారంభించారు. ఆ సమయంలో అటు ప్రయాణికులపై అదనపు భారం పడకుండా, ఇటు విమానయాన సంస్థలకు నష్టం వాటిల్లకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ చర్యలు తీసుకుంది. విమాన టికెట్ల ధరలపై ప్రయాణ సమయం ఆధారంగా పరిమితి విధించింది. ఇటీవలే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు కొండెక్కాయి. ఇప్పుడు నిర్వహణ భారంగా మారిన కారణంగా స్పైస్‌ జెట్‌ టికెట్ రేట్లను 10 నుంచి 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.