దేశవ్యాప్తంగా పలు సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల ప్రవేశానికి సంబంధించి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పలు కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్ధినీ, విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన అన్నారు.
” ఈ పరీక్షలను రెండు విడతల్లో ఆగస్టు 20 వరకు నిర్వహిస్తాం. తొలి విడత పరీక్షలు ఈ నెల 15న, రెండో విడత ఆగస్టు 4 నుంచి మొదలవుతాయి. మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు మంగళవారం వైబ్సైట్లో ఉంచాం. విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోండి. రెండో విడత అడ్మిట్ కార్డులను జూలై 31 నుంచి డౌన్లోడ్ చేసుకోండి.” అని చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ వివరానలు వెల్లడించారు.
మరోపక్క ఈ పరీక్షలను అధికారులు దేశవ్యాప్తంగా 500 నగరాలలో నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ఇతర దేశాల్లోని 10 నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న నీట్ యూజీ ఎగ్జామ్స్ ఉన్న కారణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను ఎంచుకున్న విద్యార్థులకు రెండో విడతలో పరీక్షలు నిర్వహిస్తామని, విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్న నగరాల్లోనే ఈ పరీక్ష కేంద్రాలను కేటాయించినట్టు అధికారులు పేర్కొన్నారు. సిటీ ఛాయిస్‌ను మార్చుకోవాల్సిన వారు ఎవరైనా ఉంటే వెంటనే [email protected] అనే ఈ మెయిల్ ఐడీ లేదా 01140759000 నంబర్ సంప్రదించాలని, పూర్తి వివరాలకు https://cuet.samarth.ac.inను సంప్రదించాలని కోరారు.