Note to TTD devotees.. No chance if it exceeds 12 thousand
mictv telugu

టీటీడీ భక్తులకు గమనిక..12వేలు దాటితే నో ఛాన్స్

September 23, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని, తిరుమలకు వెళ్లే అన్నీ వాహనాలు (కార్లు, బైకులు, మీనీ బస్సులు, ఆటోలు) 12 వేలు దాటిన తర్వాత, ఆపై ఒక్క వాహనాన్ని కూడా తిరుమలకు అనుమతించమని తెలియజేస్తూ, శుక్రవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంటే 12 వేల వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతిస్తారన్నమాట.

టీటీడీ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం..”తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారనే ముందు ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. టీటీడీ నిఘా, భద్రతా విభాగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసింది. తిరుమలకు వచ్చే అన్ని వాహనాలు 12 వేలు దాటిన తరువాత అనుమతించం. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి, ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు రావాలి. ప్రతి ఏటా గరుడ వాహన సేవ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. ఈ ఏడాది గరుడ సేవ 1వ తేదీన కాగా.. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబరు 2 వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించం” అని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ సారి భక్త జనం మధ్యలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో వెంకన్న స్వామి భక్తులు.. టీటీడీకి పోటెత్తనున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు..5 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడంతో భక్తులు..ఎప్పుడెప్పుడు తిరుమలకు వెళ్లాలని ఆశగా ఉన్నారు. దీంతో టీటీడీ నిఘా, భద్రతా విభాగం అప్రమత్తమై, ఈ నిర్ణయం తీసుకుంది.