ప్రభాస్ తల్లిగా ‘ప్రేమ పావురాలు’ హీరోయిన్  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ తల్లిగా ‘ప్రేమ పావురాలు’ హీరోయిన్ 

January 22, 2020

Noted Hindi actress to play Prabhas’s mom

‘ప్రేమ పావురాలు’ సినిమా గుర్తుందా? లేదు కదూ.. ‘మైనే ప్యార్ కియా’ అంటే ఠక్కున ఆ సినిమా మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ సినిమానే తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో డబ్బింగ్ చేశారు. ఆ సినిమాలోని ‘ఓ పావురమా ఏఏఏ’ అనే పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సినిమాలోని ప్రేమకథ, సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల కెమెస్ట్రీ ఇలా అన్నీ కళ్ల ముందు కదలాడుతాయి. అది ఎవర్‌గ్రీన్ సినిమాగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సల్మాన్‌కు, భాగ్యశ్రీలకు ఆ సినిమా మంచి బోణీని ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. అందులోని కథానాయిక భాగ్యశ్రీ చాలా కాలం తర్వాత తెలుగలో రీఎంట్రీ ఇవ్వనుంది. అదీ బాహుబలి ప్రభాస్‌కు తల్లిగా నటిస్తోంది.  

రాధాకృష్ణ నిర్మాణంలో ‘జాన్’ పేరుతో ఒక రొమాంటిక్ ప్రేమకథా చిత్రం వస్తోంది. ఈ చిత్రంలో ఇప్పటికే కథానాయికగా పూజా హెగ్డే ఖరారు అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత వుంటుందట. అందువల్ల ఆ పాత్రకి భాగ్యశ్రీని ఒప్పించినట్టుగా రాధాకృష్ణ చెప్పారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు. త్వరలో ఆస్ట్రేలియాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. కాగా, భాగ్యశ్రీ 20 ఏళ్ల క్రితం బాలకృష్ణకు చెల్లెలిగా ‘యువరత్న రాణా’ సినిమాలో నటించింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె తెలుగు సినిమాలో మెరవనుండడం విశేషంగా మారింది.