Notices to 12-year-old boy seeking compensation of 2.90 lakhs in madhya pradesh
mictv telugu

శ్రీరామనవమి అల్లర్లు.. రూ. 2.90 లక్షల నష్టపరిహారం కోరుతూ 12 ఏళ్ల బాలుడికి నోటీసులు

October 19, 2022

Notices to 12-year-old boy seeking compensation of 2.90 lakhs in madhya pradesh

శ్రీరామనవమి సందర్భంగా చెలరేగిన అల్లర్లలో జరిగిన నష్టానికి రూ. 2.9 లక్షలు చెల్లించాలని కోరుతూ మధ్యప్రదేశ్‌ ట్రైబ్యునల్ 12 ఏళ్ల బాలుడికి నోటీసులు జారీ చేసింది. బాలుడి తండ్రికి రూ. 4.80 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఖార్గోన్ జిల్లాలో ఏప్రిల్ 10న పండుగ సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి.

ఇవి క్రమంగా హింసాత్మకంగా మారడంతో భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం నష్టాల నివారణ, రికవరీ చట్టం కింద నష్టపరిహారం కోరుతూ నోటీసులు జారీ చేసింది. తమ ఆస్తికి నష్టం జరిగిందని ఓ మహిళ ఏడుగురిపై ఫిర్యాదు చేసింది. కొంతమందితో కలిసి 12 ఏళ్ల బాలుడు తమ ఇంట్లోకి చొరబడి దోచుకున్నారని, సామాన్లు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే దీనిపై బాలుడి తండ్రి వేరే వాదన చెప్తున్నాడు. ఆ సమయంలో తాము ఇంట్లో నిద్రపోతున్నామని తెలపాడు. నోటీసుల గురించి ట్రైబ్యునల్ సభ్యుడు ప్రభాత్ పరాశరన్‌ను సంప్రదించగా.. ‘క్రిమినల్ కేసు అయితే బాలుడికి జువైనల్ జస్టిస్ యాక్ట్ రక్షణ లభించేది. మేము సివిల్ కేసులను నిర్ణయిస్తాం. శిక్ష కాదు జరిమానా మాత్రమే విధించాం. బాలుడు మైనర్ అయినందున ఆ మొత్తాన్ని అతని తల్లిదండ్రుల నుంచి రికవరీ చేస్తారు’ అని వెల్లడించారు. అటు నోటీసులు అందిన వెంటనే బాలుడి పేరెంట్స్ హైకోర్టును ఆశ్రయించగా, బాలుడికి ట్రైబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం కల్పించింది. దీంతో బాలుడు తన తల్లి ద్వారా ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశాడు. తనపై నేరం మోపడం చట్టవిరుద్ధమని అందులో పేర్కొనగా, సెప్టెంబర్ 23న పిటిషన్‌ను ట్రైబ్యునల్ కొట్టివేసింది. ప్రభుత్వం ఈ ఘర్షణల్లో మొత్తం 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, 170 మందిని నిందితులుగా చేర్చింది. 50కి పైగా ఇళ్లు, దుకాణాలు, భవనాలను బుల్డోజర్లతో కూల్చి వేసింది.