మాజీమంత్రి అఖిలప్రియ భర్తకు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

మాజీమంత్రి అఖిలప్రియ భర్తకు నోటీసులు

June 5, 2020

Bhuma Akhilapriya.

మాజీమంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. నంద్యాల టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో విచారణకు హాజరు కావాలని భార్గవ్ రామ్‌కు పోలీసులు నోటీసులు అందించారు. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో గత నెల 15న ఈ కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల నలుగురు నిందితులను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. 

ఈ కేసు విషయంలో తమ హస్తం ఉందని ఏవీ సుబ్బారెడ్డి అంతకుముందు చేసిన వ్యాఖ్యలపై భూమా అఖిలప్రియ స్పందించారు. ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణల వెనక ఆళ్లగడ్డ అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండవచ్చని ఆమె ఆరోపణలు చేశారు. ‘ఓ కేసులో నా భర్త భార్గవ్ రామ్‌కు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. దీన్ని పక్కదారి పట్టించేందుకు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ 4 ముద్దాయిగా నాకు ఎలాంటి నోటీసులు అందలేదు. ఈ కేసులో ఇంకా విచారణ పూర్తి కాలేదు. మా హస్తం ఉన్నట్లు బయటకు రాలేదు’అని అఖిలప్రియ తెలిపారు. కాగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నుతుండగా కడప పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.