తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. వచ్చే వారంలో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌పై ప్రకటన రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వైద్యా విభాగంలో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ నియామక ప్రక్రియకు సంబంధించి అర్హుల జాబితా కూడా విడుదల చేశారు.
మంగళవారం నుంచి నవంబర్ 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. తర్వాత మరో వారం రోజుల్లోగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంటుంది. ఇది పూర్తవ్వగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలనే యోచనలో ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ఉంది. ఈ పోస్టులకు కూడా ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం నిబంధన కొనసాగుతుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులపై కూడా ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం నిబంధన ఉన్నప్పటికీ.. ఈ పోస్టులకు సుమారు 4800 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులన్నీ ఎంబీబీఎస్ అర్హతతో కూడినవే కావడంతో ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.