ఏపీలో కొత్త మండలాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆరు కొత్త మండలాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను బుధవారం జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలులను అర్బన్, రూరల్ మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మచిలీపట్నాన్ని సౌత్ మండలం, నార్త్ మండలంగా విభజించింది. మచిలీపట్నంలోని 1-19, 40 వార్డులను, 18 గ్రామాలను మచిలీపట్నం నార్త్‌గా..20-39 వార్డులు, మచిలీపట్నం రూరల్ సహా 12 గ్రామాలను మచిలీపట్నం సౌత్ మండలంగా విభజించింది. కొత్త మండలాలపై అభ్యంతరాలు, సూచనలను 30 రోజుల్లో తెలపాలని ప్రభుత్వం సూచించింది. ఆయా జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న పట్టణీకరణ, శివారు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.