తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే వైద్యారోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 13వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని హరీశ్‌రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో బుధవారం ఆయన టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను, మొబైల్ యాప్‌ను సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.
హరీష్ రావు మాట్లాడుతూ..’గతంలో ఎన్నడూ లేనంతగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచాం. వైద్యారోగ్య శాఖ బడ్జెట్‌ను డబుల్ చేశాం. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు బస్తీ దవాఖానాల్లో మందుల కొరత లేదు. డాక్టర్లు మెడిసిన్స్ బయటకు రాసినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లు ఇంటి వద్దకే వచ్చి టెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా అప్పుడప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలి. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపట్టనున్నాం. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుంది” అని ఆయన అన్నారు.