నీటిని వృథా చేస్తే లక్ష జరిమానా, ఐదేళ్ల జైలు  - MicTv.in - Telugu News
mictv telugu

నీటిని వృథా చేస్తే లక్ష జరిమానా, ఐదేళ్ల జైలు 

October 23, 2020

కొందరు నీటిని చాలా వృథా చేస్తుంటారు. అవసరానికి మించి ట్యాప్ తిప్పి నీటిని బుడబుడా పారబెట్టేస్తుంటారు. ముఖం కడుక్కోవడానికి బకెట్ నిండా నీటిని పారబోస్తారు. అలా నీటిని వృథా చేయొద్దు అని ఎంత మొత్తుకున్నా వినరు. జీవకోటికి పంచభూతాల్లో ఒకటైన నీరు ఎంత అవసరమో తెలిసి కూడా నీటిని దర్వినియోగం చేస్తుంటారు. అలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించేవారికి కఠిన శిక్షలు విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర భూగర్భ జలాల అథారిటీ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986లోని సెక్షన్ 5 ప్రకారం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. భూగర్భ జలాలను వృథా చేస్తే లక్ష రూపాయల వరకు జరిమానా సహా ఐదేళ్ళ వరకు జైలుశిక్ష విధించవచ్చు అని పేర్కొంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఇటీవల ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. రాజేంద్ర త్యాగి అండ్ ఫ్రెండ్స్ (ఎన్‌జీవో) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జీటీ ఈ ఆదేశాలు జారీచేసింది. నీటిని వృథా చేయడం, దుర్వినియోగం చేయడాన్ని శిక్షించదగ్గ నేరంగా పరిగణించాలని పిటిషనర్ కోరారు.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు, జల నిగమ్‌లు, జల మండలులు, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నీటి వృథాను, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టవలసి ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. భూగర్భ జలాలను దుర్వినియోగం, వృథా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఈ విషయమై జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ మాట్లాడుతూ… ‘ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో నీటిని నింపేటప్పుడు, మరుగుదొడ్లలో, వంట గదుల్లో నీటిని వినియోగించేటపుడు నీరు వృథా అవుతోంది. ప్రజానీకానికి నీటి వినియోగంపై అవగాహన లేకపోవడంతోనే ఇలా జరుగుతోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నీటి సమస్యలు మరింత తీవ్రం అవుతాయి’ అని యూపీ సింగ్ తెలిపారు.