లక్షల జీతం కొలువును వదిలేసి కొబ్బరాకులు అల్లుతున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

లక్షల జీతం కొలువును వదిలేసి కొబ్బరాకులు అల్లుతున్నాడు..

October 28, 2017

యాడ్స్, గ్రాఫిక్స్ డిజైనర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. ఖతర్ దేశంలో విలాసవంతమైన భవనం.. ఇవన్నీ వదిలిపెట్టి ఒక యువకుడు కేరళకు వచ్చేశాడు…ఎందుకంటే కొబ్బరాకులు అల్లడానికి! వింతగా ఉన్నా ఇది జనం. నౌషిద్ అనే యువకుడి స్వస్థలం కేరళ. అయితే బాల్యమంతా ఖతర్‌, బహ్రెయిన్‌లలో గడిచింది. మంచి ఉద్యోగం సంపాయించాడు. కానీ ఏదో అసంతృప్తి. సొంతవూరికి వెళ్లి పల్లెసీమల్లో స్వచ్ఛమైన గాలి పీలిస్తూ.. కొబ్బరాకుల గలగలల మధ్య హాయిగా బతకాలనే కోరిక.

నౌషిద్‌కు చిన్నప్పటి నుంచి ఆటబొమ్మలంటే ఇష్టం. ప్లాస్టిక్ ఆటబొమ్మలు కాకుండా కేరళలో విరివిరగా లభించే కొబ్బరాలకుతో బొమ్మలు తయారు చేయాలని అనుకున్నాడు. స్వగ్రామానికి చేరుకుని కొంత పొలం తీసుకుని రైతు అవతారం ఎత్తాడు. కొబ్బరి ఆకులతో బొమ్మలు చేయడం ప్రాక్టీస్ చేశాడు. ఆ విద్యను చుట్టుపక్కల వారికీ నేర్పిస్తున్నాడు.

కొబ్బరాకులతో పాములు, బుట్టలు, టోపీలు, కుండలు, ప్లేట్లు.. ఒకటేమిటి.. ఏది సాధ్యమైతే ఆ వస్తువలన్నీ తయారు చేస్తున్నాడు నౌషిద్. జనం కూడా వీటిని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. నేచర్ వీవ్స్ పేరుతో ఈ బొమ్మలను అమ్ముతున్నాడు.

’జీవితం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. మనం అనుకున్నట్లు హాయిగా బతకాలి’ అంటున్నాడు నౌషిద్. కొబ్బరాకుల బొమ్మలు పర్యావరణానికి హితమని, తల్లిదండ్రులు ప్లాస్టిక్ బొమ్మలకు బదులు వాటిని పిల్లలకు కొనివ్వాలని, గ్రామీణ హస్తకళాకారులను ఆదుకోవాలని కోరుతున్నాడు.