విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలంటే ఈ కాలం ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఆసక్తి. ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి జీతభత్యాలు కూడా ఎక్కువే ఉంటాయన్న భావనతో తమ కూతుళ్లని ఎన్ఆర్ఐలకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. ఎక్కువ జీతం రావటంతో పాటు లగ్జరీ లైఫ్ ఉంటుందని, బిడ్డ సంతోషంగా ఉంటుందని నమ్మి పెళ్లికి సిద్ధపడతారు. ఇలా పెళ్లిళ్లు చేసుకున్నవారిలో ఎక్కువశాతం కాపురాలు సజావుగానే ఉన్నప్పటికీ కొందరు ఎన్ఆర్ఐ భర్తలు వింత ప్రవర్తనలతో కాపురాలు కూలిపోవటంతోపాటు ఆడ పిల్లల తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇలాంటి తరహా కేసు తాజా వెలుగులోకి వచ్చింది
పెళ్లై, విదేశాలకు వెళ్లిన తరువాత అక్కడ పీజీ చేద్దామనుకున్న అమ్మాయి విషయంలో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. కట్టుకున్న భార్య చదువు ఖర్చు భారమైందని ఆ ఎన్నారై భర్త విదేశాల్లో ఆమెను ఒంటరిగా వదిలేశాడు. విషయం తెలిసిన హైదరాబాదులోని ఆమె తల్లిదండ్రులు అల్లుడికి నచ్చజెప్పడానికి ప్రయత్నించగా.. అతను ఫోన్లో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అల్లుడి తల్లిదండ్రులను సంప్రదిస్తే.. వారిద్దరికీ పడడం లేదంటూ వారు కూడా ఈజీగా తప్పించుకున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అమ్మాయి తల్లిదండ్రులు గచ్చిబౌలి మహిళా పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాదులోని మాదాపూర్ జోన్ కు చెందిన ఓ యువతి డిగ్రీ వరకు చదువుకుంది. డిగ్రీ పూర్తి కాగానే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. అలా ఐదేళ్ల క్రితం ఆమెకు అమెరికాలోని వర్జినీయాలో స్థిరపడ్డ ఓ వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు.
మొదట్లో కాపురం సజావుగానే సాగింది. ఆ ఆమ్మాయి ఆర్థికంగా భర్తకు చేదోడుగా ఉండేందుకు అక్కడ తన చదువును కొనసాగించేందుకు సిద్ధమైంది. దీంతో అక్కడే ఓ యూనివర్శిటీలో ఎంఎస్‌లో చేరింది. అయితే, కొన్నాళ్ల తరువాత భార్య చదువుకు ఖర్చు ఎక్కువ అవుతుందని ఎన్ఆర్ఐ భర్త ఆమెను వదిలించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతూ వచ్చాయి. ఈ విషయాన్ని యువతి ఇండియాలోని తల్లిదండ్రులకు తెలిపింది. పలుసార్లు యువతి తల్లిదండ్రులు అల్లుడితో మాట్లాడినా ఫలితం కనిపించలేదు. ఇండియాలో అల్లుడి తల్లిదండ్రులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోవటంతో యువతి తల్లిదండ్రులు గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విదేశాల్లో తన కూతురు ఒంటరైపోయిందని యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.