ఇకపై ఎన్నారైలు ఆధార్‌ను ఈజీగా పొందొచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై ఎన్నారైలు ఆధార్‌ను ఈజీగా పొందొచ్చు

September 24, 2019

NRIs .....

ఎన్నారైలకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వం జారీచేసే ఆధార్‌ కార్డు పొందేందుకు 182 రోజుల పాటు వారు వేచి చూడాల్సిన అవసరం ఇకలేదు. ఆ నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఇకపై పాస్‌పోర్టు కల్గిన ఎన్నారైలు ఎవరైనా స్వదేశానికి వచ్చినప్పుడు లేదా ముందస్తు అనుమతితో నేరుగా ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చుని యూఐడీఏఐ సంస్థ సర్క్యులర్‌లో స్పష్టంచేసింది. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎన్నారైలకు ఆధార్‌ మంజూరు చేయడంలో నెలకొన్న జాప్యాన్ని తొలగించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. వారు తమ వెంట తీసుకొచ్చిన పాస్‌పోర్టునే గుర్తింపు కార్డుగా, చిరునామా, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంగా పరిగణిస్తామని తెలిపింది. ఒకవేళ పాస్‌‌పోర్టులో భారతదేశంలోని చిరునామా లేకపోతే.. ఆధార్‌ సంస్థ సూచించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది.