విదేశాల్లో ఉండే భారతీయులు, భారత సంతతి వ్యక్తులు కూడా ఇకపై యూపీఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఎన్ఆర్ఈ (NRE)/ఎన్ఆర్వో(NRO) అకౌంట్లున్న ఎన్ఆర్ఐలు త్వరలో తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్ల ద్వారా యూపీఐ ( UPI) సేవలను ఉపయోగించుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. యూపీఐ సేవల కోసం భారతీయ సిమ్ కార్డు అవసరం లేదు. ముందుగా సింగపూర్, అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఒమన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, హాంగ్ కాంగ్ దేశాల్లో ఉండే వారికి ఈ అవకాశం అందుబాటులోకి రానుంది.
ఈ దేశాల్లోని భారత సంతతి వారు ఎన్ఆర్ఈ ఖాతాను, ఈ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఎన్ఆర్ వో ఖాతాను తెరిచి, వాటితో యూపీఐ సేవలు పొందొచ్చు. మరో యూపీఐ యూజర్ కు నగదు బదిలీ, చెల్లింపుల సేవలను చేసుకోవచ్చు. విదేశీ మారకం నిర్వహణ చట్టం, ఆర్ బీఐ నిబంధనలు వీరికి వర్తిస్తాయి.‘‘ఎన్ఆర్ఐలు భారత్కు వచ్చిన సందర్భంలో నగదు చెల్లింపులు/బదిలీకి యూపీఐ సేవలు వినియోగించుకోవచ్చు’’ అని పేమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ విశ్వాస్ పటేల్ తెలిపారు. త్వరలో యూపీఐ నిర్వహణ సంస్థలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన తర్వాత ఎన్ఆర్ఐలు తమ అంతర్జాతీయ ఫోన్ నంబర్లకు ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో నంబర్లు అనుసంధానించి యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.