బాబ్రీని కూల్చివేసిన నిందితునికి అయోధ్య ట్రస్ట్ బాధ్యతలు - MicTv.in - Telugu News
mictv telugu

బాబ్రీని కూల్చివేసిన నిందితునికి అయోధ్య ట్రస్ట్ బాధ్యతలు

February 20, 2020

c nc b

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. దీంట్లో భాగంగా ఆలయ ట్రస్ట్ తొలిసారి సమావేశం అయింది. ఈ సమావేశంలోనే హిందూ మత పెద్దలు, రామాలయం నిర్మాణానికి నేతృత్వం వహించే కమిటీని ఎంపిక చేశారు. దీంట్లో అయోధ్య ట్రస్ట్ చీఫ్‌గా విశ్వ హిందూ పరిషత్ అనుబంధ రామ జన్మభూమి న్యాస్ అధినేత  నృత్య గోపాల్ దాస్ బాధ్యతలు నిర్వహించనున్నారు. రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌గా నృపేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. 

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా నృత్యగోపాల్ దాస్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయనే అయోధ్య రామాలయ ట్రస్ట్‌కు అధినేతగా ఎంపిక అయ్యారు. దీంతో అతని ఎంపిక ఇప్పుడు ఆసక్తిగా మారింది.  ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఆలయ కమిటీలో 80 సంవత్సరాలు దాటిన వారినే ఎంపిక చేయడంతో యువకులకు అవకాశం లేకుండా పోయిందనే వాదనలు వినబడుతున్నాయి.

 కాగా సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఇటీవల కేంద్రం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు ఈ నెల 5న పార్లమెంట్ కు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. మొత్తం మీద అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ట్రస్ట్ తొలిసమావేశం ఏర్పాటు చేయడంతో ఇక పనులు వేగవంతం అవుతాయని పలువురు అంటున్నారు. త్వరలోనే ఆలయ శంకుస్థాపనకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలో సమావేశమయ్యే నూతన కమిటీ శంకుస్థాపన తేదీని ఖరారు చేయనుంది. దీనికి ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.