NTA sweet talk for NEET students..Extend time
mictv telugu

 నీట్ విద్యార్థులకు ఎన్టీఏ తీపికబురు..సమయం పెంపు

July 16, 2022

దేశవ్యాప్తంగా రేపు జరగబోయే నీట్ పరీక్షకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు తెలిపారు. 2022-23లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షను రాయబోతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అధికారులు ఓ తీపికబురు చెప్పారు. గతంలో పరీక్ష సమయం 3 గంటలు ఉండగా, ఈసారి 20 నిమిషాల సమయాన్ని అదనంగా కల్పిస్తూ, శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

”వైద్య విద్య (యూజీ) నీట్ 2022-23లో ప్రవేశాల కోసం ఈనెల 17న పరీక్ష జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నీట్ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు జరుగుతుంది. ఈసారి విద్యార్థులకు పరీక్ష సమయాన్ని 20 నిమిషాల వరకు అదనంగా పెంచాం. మొత్తం 200 ప్రశ్నలకు 200 నిమిషాల సమయాన్ని ఇవ్వగా, అందులో 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానమివ్వాలి. గతేడాది 200 ప్రశ్నలిచ్చి 180 నిమిషాల్లోనే 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వచ్చేది. దాంతో విద్యార్థులు ఆ అదనపు 20 ప్రశ్నలను చదువుకొని, అర్ధం చేసుకొని, సమాధానం ఇవ్వడానికి సమయం సరిపోయేది కాదు. ఇప్పుడా ఆ విషయంలో ఆందోళన అవసరం లేదు” అని అధికారులు పేర్కొన్నారు.

ఇక, ఈ నీట్ పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం , రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హయత్ నగర్ తదితర 25 పట్టణాలోని 115 కేంద్రాల్లో నీట్‌ను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వర్గాలు పేర్కొన్నాయి.

అంతేకాదు, ఈ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లం సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ రాయొచ్చని, తెలంగాణలో సుమారు 60 వేల మంది విద్యార్ధులు ఈ పరీక్షను రాయనున్నారని తెలిపారు. పరీక్ష సమయానికి అరగంట ముందు అంటే మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించమని, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోని పరీక్షకు గంటముందే హాజరుకావాలని సూచించారు.