‘ఆర్ఆర్ఆర్’పై ఎన్టీఆర్ భావోద్వేగ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’పై ఎన్టీఆర్ భావోద్వేగ లేఖ

March 29, 2022

cvb

 

 

 

 

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్‌పై తనకున్న అనుబంధాన్ని, అనుభవాలను, ఆనందాన్ని ఎన్టీఆర్ ఓ లేఖ ద్వారా పంచుకున్నారు. అందులో చిత్ర బృందానికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ లేఖలోని అంశాలు ఆయన మాటల్లోనే.. ‘ నా కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌గా నిలిచిన ఈ చిత్రంపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నాలో మరో నటుడిని పరిచయం చేసినందుకు జక్కన్నకు థ్యాంక్స్. రామ్ చరణ్ లేనిదే ఆర్ఆర్ఆర్ లేదు. సీతారామరాజు పాత్రను నువ్వు చేయడం వల్లే కొమురం భీం పాత్ర అంత అద్భుతంగా వచ్చిందేమో. ఆ పాత్రకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేర’ని పేర్కొన్నారు.

 

 

అంతేకాక ‘ అజయ్ దేవగణ్‌తో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. అలియా భట్ నటనలో ఓ పవర్ హౌస్. నీ నటన సినిమాకు వెన్నెముకగా నిలిచింది. విదేశీ నటీనటులు చాలా బాగా చేశారు. భారత సంస్కృతి, సినిమాలకు మీకు స్వాగతం. ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆర్ఆర్ఆర్ సినిమా కలను నిజం చేసినందుకు డీవీవీ దానయ్యగారికి ధన్యవాదాలు. కీరవాణి.. మీ సంగీతంతో అన్ని హద్దులనూ చెరిపేసి సినిమాకు ప్రాణం పోశారు’.

 

‘ కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పించే కథను అందించిన విజయేంద్రప్రసాద్ గారికి, ఇతర సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. మీ సహకారం వల్లే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. కొత్త స్టెప్పులతో అలరించిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు స్పెషల్ థ్యాంక్స్. కొమురం భీముడో పాట పాడి కోట్లాది మంది చేత కన్నీళ్లు తెప్పించిన కార్తికేయకు అభినందనలు. చిత్రాన్ని విజయవంతం చేసిన భారత ప్రేక్షకులకు, ఇతర భాషల ఇండస్ట్రీలకు ధన్యవాదాలు. మనం ఒకటిగా ఉంటే ఇండియన్ సినిమా ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉంటుంది. కరోనా కష్ట సమయంలో నాకు తోడుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని మంచి చిత్రాల ద్వారా మిమ్మల్ని ఆనందపరుస్తా’నంటూ ముగించారు.